అశ్వత్థామ సేన కాదు.. అభిమన్యుల సైన్యమే!

Ashwathama Reddy RTC
Spread the love

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె దాదాపు 50 రోజులకు దగ్గరైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు సహా సకల జనుల సమ్మె జరిగింది 42 రోజులు మాత్రమే. అంటే..ఇప్పుడు  ఆ రికార్డ్ ను బద్దలు కొట్టి ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారన్నమాట. ఆర్టీసీ కార్మికుడు అంటనే… సగటు జీతగాడు. సెప్టెంబర్ నెల నుంచే వీరికి జీతాల్లేవ్. అక్టోబర్, నవంబర్ నెలలకు కూడా జీతాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి సందర్భంలో.. తమ ఆర్థిక పరిస్థితికి ఎదురొడ్డి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో దూకారు. డిమాండ్ల సాధనలో ఒక్కో మెట్టు దిగుతున్నారు కూడా. ఐతే… తాజాగా హైకోర్టు తీర్పుతో వారిలో ఎంతో అసంతృప్తి ఏర్పడింది.

ప్రభుత్వానికి హైకోర్టే క్లాస్ తీసుకుంటుంది.. తమకు  మళ్లీ ఉద్యోగాలు దక్కుతాయనుకున్న కార్మికులకు హైకోర్టునుంచి అనుకున్న స్పందన రాలేదు దయచూపండి.. కార్మికులను విధుల్లోకి తీసుకోండి అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని వేడుకున్నదే కానీ.. సీఎం కేసీఆర్ కు సూటిగా ఆదేశాలు ఇవ్వలేదు. ‘హైకోర్టు ఏమైనా కొడ్తదా’ అని ఇటీవల కేసీఆర్ చెప్పిన మాటలే ఆఖరుకు నిజమయ్యాయి. దీంతో.. కార్మికులు డీలా పడిపోయారు. సమ్మె కొనసాగిస్తే.. నెక్స్ట్ ఏంటి అనే పరిస్థితి వచ్చింది.

అశ్వత్థామ కాదు.. అభిమన్యు సేన

అభిమన్యుడు యుద్ధంలో పద్మవ్యూహంలోకి వెళ్తాడు. కానీ.. పద్మవ్యూహం ఛేదించుకుని బయటకు ఎలా వెళ్లాలో తెలియక.. శత్రుసేన చేతిలో ప్రాణాలొదులుతాడు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు చేసిన సుదీర్ఘ సమ్మె పరిస్థితి కూడా అలాగే ఉంది. కార్మికులు కేసీఆర్ ఆదేశాలను ధిక్కరించి.. కఠినంగా నిలబడినా… ఆయన పన్నిన పద్మవ్యూహంలో కోర్టు కూడా ఏమీ చేయలేకపోయింది. తాను అనుకున్న నిర్ణయాన్ని బలపరిచే వాదనతో కోర్టునే మెప్పిస్తున్నారు కేసీఆర్. అదేసమయంలో… తమ వాదనను బలంగా వినిపించలేకపోతోంది ఆర్టీసీ జేఏసీ. రెండు వాదనల్లోనూ లోపాలుండొచ్చు… బలం ఉండొచ్చు. కానీ.. వాదన ఎవరు గట్టిగా వాదిస్తారన్నదానిపైనే కోర్టు తీర్పులు ఆధారపడి ఉంటాయి. అవే తీర్పులు  అమలులోకి వస్తుంటాయి. ఈ విషయంలో.. కేసీఆర్ పద్మవ్యూహంలో నాయకులు చేసిన దీక్షలు.. నిరసనలు… చేయించిన వాదనలు… అన్నీ ఇరుక్కుపోయి.. కార్మికులు ఇబ్బందిపడే పరిస్థితి వచ్చింది.

Read Also : రాముడు అయోధ్యలోనే ఉన్నాడని కోర్టు ఇలా తేల్చింది…!

అశ్వత్థామ రెడ్డి కన్వీనర్ గా ఉన్న జేఏసీ వ్యూహాల అమలులో మొదట స్ట్రాంగ్ గా కనిపించింది. కానీ.. ఎదురుగా శిలలాంటి కేసీఆర్ ఉన్నప్పుడు… ఆయన కోర్టులో తన వాదనను గెల్పించుకునేలా పదునైన వాదనలు వినిపించినప్పుడు… ఆర్టీసీ జేఏసీ చిన్నబోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మానవత్వ కోణంలో చూస్తే.. మెట్టు దిగిన ఆర్టీసీ కార్మికులను చూస్తే పాపం అనిపిస్తుంది. వాళ్లనుకున్నది చేసి.. తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది ఎవరికైనా. కానీ… కేసీఆర్ తాను పట్టిన పట్టు వదలడం లేదు. గడువు ఇచ్చినప్పుడే చేరాల్సింది.. ఆలస్యం చేశారు.. మీ పని ఔట్ అన్నట్టుగా కఠినంగా ఉంటున్నారు. కుటుంబాలు, సామాజిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ చూపే ఔదార్యమే వారిపాలిట భాగ్యరేఖ కావాలిప్పుడు.

(Visited 54 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *