Telugu Journalism : ‘నమస్తే తెలంగాణ’ జర్నలిస్టుల గోస.. ఆదుకున్న విజయక్రాంతి!

Namasthe telangana Vijayakranthi Telangana Journalism
Spread the love

(జర్నలిస్టుల సంక్షేమం కోరి కథనం యథాతథం.. Courtesy : వాస్తవం .. దండుగుల శ్రీనివాస్ రచన)

Namasthe Telangana – Vijaya Kranthi : తెలంగాణలో నమస్తే తెలంగాణ పత్రిక (Namasthe Telangana) ఓ సంచలనం. ఉద్యమస్పూర్తితో వచ్చిన ఆ పత్రిక కేసీఆర్ చేతుల్లో పడ్డాక ప్రభ కోల్పోయింది. ఆదిలో జర్నలిస్టులంతా ఉద్యమకారుల్లాగే పనిచేశారు. జీతాలు పెద్దగా ఆశించలేదు. నిలబడి కలబడాలి.. అనుకున్నది సాధించాలనేదే లక్ష్యం. ఆ పేపర్‌ క్రెడిబిలిటీ కూడా అదే లెవల్లో ఉండేది. అంతా అక్కున చేర్చుకున్నారు. ఆ తరువాత దాని పరిస్థితి మారింది. ఎడిటర్లు మారుతూ వచ్చారు. చివరకు ఇప్పుడు దిక్కు దివానం లేకుండా పోయింది. ఆనాటి ఉద్యమ జర్నలిస్టులు, కుటుంబాలను, జీవితాలను పణంగా పెట్టి వచ్చిన వారంతా చెల్లాచెదరయ్యాయి. ఆ జర్నలిస్టులంతా రోడ్డున పడటానికి కారణం నమస్తే తెలంగాణ ఎడిటర్‌ తీగుళ్ల కృష్ణమూర్తి.

ఆనాడు అలా వెళ్లగొట్టబడిన, అవమానించి తీసేయబడిన, బదిలీల పేరుతో బలికాబడిన జర్నలిస్టులకు అండగా నిలిచింది కొత్తగా వచ్చిన దిశ డిజిటల్ ఎడిషన్. దిశ డిజటల్‌ పేపర్ (Disha Telugu Daily ) ఎడిటర్‌ మార్కండేయ కూడా నమస్తే రాజకీయాలకు బలైనవాడే. అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న మార్కండేయ సాధ్యమైనంత వరకు నమస్తే తెలంగాణ నుంచి వచ్చిన జర్నలిస్టులను తీసుకున్నాడు. కరోనా టైంలో ఉద్యోగాలు దొరకడమే గగనం, బతుకే భారమైన ఆ సమయంలో దిశ వారిని ఆదుకుని పెద్ద మనసు చాటుకున్నది. ఇప్పుడు మళ్లీ అవే పరిస్థితులు నమస్తే తెలంగాణలో దాపురించాయి. ప్రభుత్వం పతనం కాగానే దీన్ని యాజమాన్యం పట్టించుకోవడం మానేసింది. ఉన్న ఉద్యోగులు తమంతగా తాను వెళ్లిపోవడమే, వీరే కుదించడమో చేసేస్తున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌.. వీరంతా ఇప్పుడు దీని విషయమే పట్టించుకోవడం మానేశారు.

ఇలాంటి క్లిష్ట సమయంలో మళ్లీ తెరపైకి వచ్చింది విజయక్రాంతి పత్రిక (Vijaya Kranthi). గతంలో నమస్తే తెలంగాణ సీఎండీగా చేసిన సీఎల్‌ రాజం(CL Rajam)..సొంతగా పెట్టుకున్న పత్రిక విజయక్రాంతి ఇది. ఎన్నికలకు ముందు కొన్ని రోజులు ఈ పత్రిక నడిచింది. కేసీఆర్‌(KCR)పై, అధికార పార్టీపై దుమ్మెత్తి పోయడంతో కేసీఆర్ దీన్ని తొక్కేశాడు. ఈ బెదిరింపులు సీఎల్‌ రాజంకు రెండోసారి. అప్పుడు నమస్తే నుంచి కేసీయారే సీఎల్ రాజంను సాగనంపాడు. కాంగ్రెస్ స్టాండ్‌ తీసుకున్నాడనేది కేసీఆర్‌ కోపం. విజయక్రాంతి నడిపినా దాన్నీ నడవనీయలేదు కేసీఆర్. ఇప్పుడు మళ్లీ బయటకు తీశాడు సీఎల్ రాజం. ఇటు కాంగ్రెస్‌, బీజేపీ పెద్దలతో సత్సంబంధాలున్న వ్యాపారవేత్త సీఎల్ రాజం. ప్రస్తుత రాజకీయ వాతావరణం తనకు అనుకూలంగా ఉందని భావించి ఆయన మళ్లీ ఈ పేపర్‌ను బయటకు తీసేందుకు అంతా రెడీ చేసుకుంటున్నాడు.

దీనికి పెద్ద కేఎం( కృష్ణమూర్తి-Krishna Murthy) ఎడిటర్‌. కేఎం.. నమస్తే తెలంగాణలో ఆది నుంచి తొమ్మిదేళ్ల పాటు అసిస్టెంట్ ఎడిటర్‌గా, సెంట్రల్‌ డెస్క్‌ ఇంచార్జిగా పనిచేశాడు. నమస్తే తెలంగాణకు ఎడిటర్‌గా ఉన్న కట్టా శేఖర్‌రెడ్డి(Katta Shekhar Reddy) స్థానంలో తీగుళ్ల కృష్ణమూర్తిని కేసీఆర్ తెచ్చిపెట్టగానే ఈ పెద్ద కేఎం రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. వరంగల్‌ బీసీ బిడ్డ అయిన పెద్ద కేఎం నమస్తే తెలంగాణను ఉద్యమస్పూర్తితో నడిపించాడు. ఇప్పుడు ఆయనే దీనికి ఎడిటర్‌గా ఉన్నాడు. వచ్చే నెల మొదటి వారంలో పేపర్ బయటకు వస్తున్నది. నమస్తేలో కన్నా జీతం కొంచెం పెంచే ఇచ్చి మరీ తీసుకుంటున్నాడు సీఎల్‌ రాజం. పత్రికా విలువలతో నడిపి, జర్నలిస్టులకు అండగా ఉంటానని మాటిచ్చి మరీ దీన్ని బయటకు తీస్తున్నాడు సీఎల్‌ రాజం. ప్రస్తుతం మీడియా గడ్డు పరిస్థితుల కాలంలో విజయక్రాంతి తెలంగాణ జర్నలిస్టులకు అండగా నిలుస్తోంది. నమస్తే లాంటి పత్రికను నమ్ముకుని ఎటుకాకుండా పోతున్నామనే భయంతో ఉన్న పత్రికా జర్నలిస్టులకు ఇది కొండంత బలాన్నిస్తోంది. ఈ పత్రిక రీలాంజ్ సక్సెస్ కావాలని ఆశిద్దాం.

(Visited 1 times, 1 visits today)
Author: kekanews