గత కొన్ని నెలల నుండి అభ్యుదయ నగర్ కాలనీ వాసులు తీవ్ర మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఈ విషయంలో రెండు వారాల క్రిందట వాటర్ వర్క్స్ డిపార్టుమెంటు వారి దృష్టికి సామాజిక వేత్త నరేందర్ బాబు తీసుకొని వెళ్లగా అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించేందుకు వాటర్ ఎయిర్ వాల్వ్ ఏర్పాటు చేశారు. అయితే సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు.
ఈ విషయమై నిన్న ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ గారిని అభ్యుదయ నగర్ కాలనీ వాసులు కలిసి సమస్యను వివరించారు, వెంటనే స్పందించిన ఎంఎల్ఏ గారు వాటర్ వర్క్స్ డిపార్టుమెంటు జనరల్ మేనేజర్ రవీందర్ రెడ్డి గారికి ఫోన్ లో మాట్లాడారు.
ఈ రోజు వాటర్ వర్క్స్ డిపార్టుమెంటు జనరల్ మేనేజర్ రవీందర్ రెడ్డి అభ్యుదయ నగర్ కాలనీ సందర్శించి సమస్యలను కాలనీ వాసులతో అడిగి తెలుసుకున్నారు. గతంలో వాటర్ వాల్వ్ ద్వారా నీటిని ఒక ప్రణాళిక ప్రకారం అందించారని అయితే ఒక సంవత్సరం క్రితం నూతన వాటర్ పైప్లు వేసినప్పుడు వాల్వ్ లను తీసేసి గ్రావిటేషన్ పద్ధతిలో నీరు అందిస్తామని మరియు సమస్య ఉత్పన్నం కాకుండా చూస్తామని అధికారులు తెలిపారని కాలనీవాసులు గుర్తు చేశారు. సుమారుగా ఒక సంవత్సరం ఐనా గానీ సమస్య మరింత జటిలం అయ్యిందని కాలనీ వాసులు వాపోతున్నారు. దీనికి పరిష్కారంగా గతంలోలాగా వాటర్ వాల్వ్ లను ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణ మరియు సామాజిక వేత్త నరేందర్ బాబు, బాబులాల్, రవి శంకర్, చంద్రశేఖర్, లోకేష్, కృష్ణ ప్రసాద్, వెంకట్, మార్క్, రాములు తదితరులు పాల్గొన్నారు.