Save Damagundam-HYDRAA : వికారాబాద్ జిల్లాలో 5 వేల ఎకరాల్లో విస్తరించిన దామగుండం ఫారెస్ట్ లో భారత నౌకాదళం సిగ్నల్ రాడార్ వ్యవస్థ ఏర్పాటుతో ఆహ్లాదకమైన వాతావరణం కోల్పోవడంతో పాటు, రేడియేషన్ తో ప్రాణాంతకమైన వ్యాధులు సంక్రమించనున్నట్లు పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల మనుగడ కష్టం అవుతుందని చెప్పారు. భారీగా భూమిని స్వాధీనం చేసుకుంటే వన్యప్రాణుల ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టులను అడ్డుకుంటామని ప్రజా సంఘాల ప్రతినిధులు స్పష్టంచేస్తున్నారు. ఇందులో భాగంగా ‘సేవ్ దామగుండం- సేవ్ వికారాబాద్’ పేరిట ఆందోళనలు ఊపందుకుంటున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హైడ్రా(HYDRAA- Ranganath) పేరుతో చేస్తున్న ప్రకృతి రక్షణ అంతా బూటకమని.. వెనకాల ఇంత పెద్ద ప్రకృతి విధ్వంసం జరుగుతోందని పర్యావరణ వేత్తలు,యూట్యూబర్లు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్ ఇంకెంత దూరం వెళ్తుందో అన్నది ఉత్కంఠగా మారింది.
హైదరాబాద్ లో ధర్నా చౌక్ లో దామగుండం ఫారెస్ట్ రక్షణ కోసం ఉద్యమాలు, నిరసనలకు పిలుపునివ్వడంపై ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇంటలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకుంటోంది. 2010 నుంచి ప్రతిపాదన దశలోనే ఉన్న నౌకాదళ రాడార్ ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకనే 2024 జనవరిలో అడుగు ముందుకుపడింది. దీంతో.. బీఆర్ఎస్ (BRS – KCR – KTR – Harish Rao) ఎలా స్పందిస్తుందన్నదానిపైన కూడా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
దామగుండం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న నేవీ రాడార్ స్టేషను పలువురు ప్రజాప్రతినిధులతో పాటు.. సామాన్యులు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పూడూరు మండలం దామగుండం అడవి 2900 ఎకరాల్లో నేవీ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. సముద్ర మట్టానికి 350 మీటర్ల ఎత్తులో ఉండటంతో సిగ్నల్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు నేవీ అధికారులు వెల్లడించారు. రాడార్ ఏర్పాటుతో ఈ ప్రాంత పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు, ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రాడార్ ఏర్పాటుతో లక్షలాది వృక్షజాతి సంపద, జీవరాశులతో పాటు ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన దామగుండ రామలింగేశ్వర స్వామి ఆలయం మనుగడకు ప్రమాదం ఏర్పడనుందని, ప్రాంతం మొత్తం కాలుష్యకోరల్లో చిక్కుకోనుందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. ప్రసిద్ధిగాంచిన రామలింగేశ్వరున్ని దర్శించుకోవాలనే భక్తుల కోరిక దినదిన గండంగా మారనుందని, గుడికి వెళ్లాలంటే ఇకమీదట ఆంక్షలు విధించనున్నారని వెల్లడించారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రాజెక్టులు అవసరం లేదని స్పష్టంచేస్తున్నారు. రాడార్ల కు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఆందోళనలకు సిద్ధం కానున్నట్లు పేర్కొంటున్నారు. కేంద్రం పనులకు గత నెల 28న భూమిపూజకు ముహూర్తం ఖరారు చేసినప్పటికీ… సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది.
“ప్రజలకు, ప్రాంతానికి హానీ కలిగించే ఎలాంటి ప్రాజెక్టులనైనా అడ్డుకుంటాం. రేడియేషన్ వలన జీవకోటికి ఇబ్బందులు వస్తాయనే ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకుండా గత ప్రభుత్వం అడ్డుకుంది. పరిసర ప్రాంత ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా అటవీ శాఖ దామగుండ అటవీ భూములను రక్షణ శాఖకు అప్పగించడం సరైందికాదు. నేవీ రాడార్ ఏర్పాటు ఆలోచనను ప్రభుత్వాలు విరమించుకోవాలి” అని సమీప గ్రామం పూడూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు.
“అహ్లాదకరమైన వాతావరణాన్ని దెబ్బతీసే ప్రాజెక్టులు వద్దంటే వద్దు. ఈ ప్రాంతం ప్రకృతి సంపదతో ఉట్టి పడుతుంది. చరిత్ర కలిగిన రామలింగేశ్వర ఆలయం ఉంది. సిగ్నల్ రేడియేషన్ ప్రభావం జీవరాశిపై తీవ్ర ప్రభావం చూపనుంది. పర్యావరణానికి హానీ కలిగించే నేవీ రాడార్ను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉంటాం.” అని ఆర్టీఐ కన్వీనర్ వెంకటయ్య చెబుతున్నారు.
(Visited 87 times, 1 visits today)