Delhi election results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. బీజేపీ 48 సీట్లతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ కాకుండా అనేక పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఈ ఎన్నికల్లో(Delhi election results) కేవలం 4 ఓట్లు మాత్రమే వచ్చిన ఓపార్టీ అభ్యర్థి కూడా ఉన్నారు. ఇక్కడో ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. అతను తన ఓటు కూడా తను వేసుకోలేకపోయాడు. బహుశా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి ఇతనే కావచ్చు. కేవలం 4 ఓట్లు మాత్రమే వచ్చిన వ్యక్తి గురించి చాలా చర్చ జరుగుతోంది. ఇంతకు ఇతను ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఈ అభ్యర్థి పేరు ఈశ్వర్ చంద్. 72 ఏళ్ల ఈయన న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుండి భారత్ రాష్ట్ర డెమోక్రటిక్ పార్టీ టికెట్ పై పోటీ చేశారు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడినుంచే పోటీలో నిలిచారు. ఈశ్వర్ చంద్ మొత్తం 4 ఓట్లు పొందారు. ఈశ్వర్ చంద్ మయూర్ విహార్ ఫేజ్-2 నివాసి. అతని ఓటర్ లిస్టు పట్పర్‌గంజ్‌లో ఉంది కాబట్టి అతను తనకు తానుగా ఓటు వేయలేకపోయాడు. న్యూఢిల్లీ సీటు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక షాక్ అయిన ఈశ్వర్ చంద్ తన ఫలితాలను తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. ప్రస్తుతం తన ఓటమి గురించి ఆలోచిస్తున్నానని తెలిపారు.
కేవలం 4 ఓట్లు మాత్రమే రావడంపై ఈశ్వర్ చంద్ మాట్లాడుతూ, ‘ మాది భావజాల పార్టీ. మా పార్టీ చాలా కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోంది. మా పార్టీకి అందరి పట్ల సమాన భావాలు ఉన్నాయి. మేము మా పార్టీని రంగంలోకి దింపాలనుకున్నాము. వేరే అభ్యర్థి లేక ఆ ఎన్నికల్లో నన్ను మాత్రమే నిలబెట్టింది. మేము ప్రతి బూత్ స్థాయి నుంచి పని చేశాము. బాగానే ఓట్లు వస్తాయని మేము ఆశించాము. కానీ అది జరగలేదు. మా కార్యకర్తలు కూడా చాలా కష్టపడి పనిచేశారు. అసెంబ్లీ అంతటా విస్తృతంగా ప్రచారం చేశారని తెలిపాడు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఈశ్వర్ చంద్ ఇంజనీర్ అతను రూర్కీ విశ్వవిద్యాలయం నుండి చదువుకున్నాడు. తనకు వచ్చే వడ్డీ ద్వారా తన ఆదాయాన్ని పొందుతున్నానని పేర్కొన్నారు.