India Power Index : ఆసియాలో అత్యంత శక్తివంతమైన మూడవ దేశంగా భారత్ నిలిచింది. ఏసియా పవర్ ఇండెక్స్(Asia Power Index) జపాన్ ను వెనక్కి నెట్టడం ద్వారా మెరుగైన ర్యాంక్ ను చేరుకుంది. భౌగోళిక-రాజకీయ స్థాయిలో భారత్ పురోగతికి ఇదొక ప్రధాన నిదర్శనం. అంతర్జాతీయ వేదికపై దూకుడు, అధిక సంఖ్యలో యువ జనాభా, వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ భారతదేశాన్ని మూడవ స్థానానికి చేర్చడంలో చోదక శక్తిగా నిలిచాయి. తాజా ర్యాంకింగ్ తో ఆసియాలో ఒక అగ్రగామి శక్తిగా భారతదేశం తన స్థానాన్ని మరింత బలపరచుకొంది.
ఆసియా దేశాల్లో ఎప్పటి కప్పుడు భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తోందన్న విషయాన్ని ‘ఏసియా పవర్ ఇండెక్స్ 2024’ స్పష్టం చేస్తోంది. సంస్కృతి పరమైన అంశా ల్లోనూ భారత్ మంచి స్కోర్ సాధించింది. ప్రపంచంలో అనేక దేశాలలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు, ప్రపంచ వేదికలపై భిన్న కళా రంగాల్లో చూపిస్తున్న ప్రతిభ ఇందుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. అలాగే, బహుళ విభాగాల్లో దౌత్యం, భద్రత సంబంధిత సహకారాలలో పోషిస్తున్న పాత్ర కూడా మనదేశ శక్తిని పెం చింది. ఆర్థిక వృద్ధి, భవిష్యత్ ప్రగతి, దౌత్యవిజయాలు, భారత్ ను ఈ ఇండెక్స్ లో ముందుకు నెట్టాయి. భావి వనరుల విషయంలోనూ 8.2 పాయింట్ల మేర వృద్ధి కనిపించింది.
అసలు.. ఏసియా పవర్ ఇండెక్స్ ఏంటో ఓసారి చూద్దాం
లోవీ ఇనిస్టిట్యూట్ 2018 నుంచి ‘ది ఏసియా పవర్ ఇండెక్స్ ను రిలీజ్ చేస్తూ వస్తోంది. ఈ సూచిక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో పురోగతిని లెక్కి స్తోంది. 27 దేశాలకు సంబంధించిన ర్యాంకులను విడుదల చేస్తుంది. ఈ ప్రాం తంలో వాటిశక్తి, ప్రాబల్యాలను పరిగణనలోకి తీసుకుని బుధవారం 2024 సంచి కను ఆవిష్కరించింది. మొట్టమొదటి సారిగా తిమోర్-లెస్తే దేశాన్ని ఈసూచీలో చేర్చారు. ఈ సూచి ఆయా ప్రభుత్వాల పనితీరుతో పాటు అంతర్జాతీయ వేదికల మీద ఆయా దేశాలు చూపించే ప్రభావాన్ని చాటుతుంది. ఆర్థిక యోగ్యత, సైనిక సామర్థ్యం, ప్రతికూలతలకు ఎదురొడ్డి నిలిచే శక్తి, భావికాలపు వనరులు, ప్రభావ ఆధారిత కొలమానాలు, ఆర్థిక సంబంధాలు, రక్షణ సంబంధిత నెట్వర్క్ లు, దౌత్య విజయాలు, సాంస్కృతిక సంబంధాలు వంటి ఎనిమిది రకాల కొలమానాల సగటుతో ఒక దేశం తాలూకు సమగ్ర శక్తిని గణిస్తారు. ఇందులో 131 వ్యక్తిగత సూచికలు కూడా కలిసివున్నాయి.