KTR : మూసీ సుందరీకరణ(Musi river rejuvenation plan- Amrapali)ను సీఎం రేవంత్ (Revanth Reddy) పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని వీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. కొత్తగా మూసీని శుద్ధి చేయాల్సిన అవసరం లేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఎస్టీపీలను ఉపయోగించుకుంటే సరిపోతుందని ఆయన అన్నారు. తమ హయాంలో రూ. 4వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 31ఎస్టీపీలు నిర్మించినట్లు ఆయన గుర్తు చేశారు.
మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదని, రూ. లక్ష 50వేల కోట్లు.. 70వేల కోట్లు.. 50వేల కోట్లంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారని కేటీార్ విమర్శించారు. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అసలు ఉద్దేశం వేరే ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు కట్టకుంటే మూసీ నిర్వాసితులకు ఎక్కడ నుంచి ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా? అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సిటీ ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రాపై ఒక నిర్ణయానికి వస్తామని ఆయన ప్రకటించారు. పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ అనే బాలిక ఒక ఉదాహరణని కేటీఆర్ అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం చేసే పనులను బీఆర్ఎస్ గతంలోనే చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తే చాలని ఆయన సూచించారు. పబ్లిసిటీ స్టంట్లతో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరని ఆయన ఎద్దేవా చేశారు. ఇండియాలో 31ఎస్టీపీలున్న ఏకైన నగరం హైదరాబాద్ మాత్రమేనని, అది కేసీఆర్ ముందు చూపుకు నిదర్శనమని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సిటీలో నిర్మించిన అన్ని ఎస్టీపీలను సందర్శించి, కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ప్రజలకు తెలియజేస్తామని ఆయన బుధవారం ఫతేనగర్ అన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పలువురు పార్టీ నేతలు ఉన్నారు.