ఖతం.. ఆర్టీసీ పనైపోయింది… వాళ్లను వాళ్లే నరుక్కున్నరు : కేసీఆర్

CM KCR Statement On RTC
Spread the love

“రాష్ట్రంలో RTC పనైపోయింది… సమ్మె కార్మికులు ముగించుడు కాదు… అసలు ఆర్టీసీ సంస్థ పనే ముగింపుకొచ్చింది.. ఇపుడు ఎవ్వడు ఏం చెయ్యలేడు. పండగ పూట జనాలను ఇబ్బంది పెట్టి.. దిక్కుమాలిన రాజకీయాలు చేశారు. ఇది సమ్మె కాదు.. వాళ్లను వాళ్లే నరుక్కునే పని. యూనియన్ నాయకుల మాటలు విని కార్మికులు తమను తామే చెడగొట్టుకున్నరు. మెడకాయ మీద తలకాయ లేనోడు చేసిన పని.. తెలివి తక్కువ పని… బుద్ధి, జ్ఞానం లేనోడు చేసిన పని. అసలుకే నష్టాల్లో ఉన్న సంస్థను బాగు చేసుకునే ఉద్దేశమే వాళ్లకు లేదు. మమ్మల్ని మేమే చంపుకుంటమంటే.. వాళ్లను ఇంకెవడు కాపాడ్తడండి.. రాష్ట్రంలో 8వేల బస్సులు, 2వేల 500 అద్దె బస్సులు తిరుగుతున్నయ్. 2రోజుల్లోనే ప్రకటన చేస్తా. ఆర్టీసీ సంస్థే ఉండదు. ఆ సంస్థే లేదు. దానికి భవిష్యత్తు లేదు.”

ఇదీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటన. హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన తర్వాత.. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దాదాపు గంటన్నర పాటు సీఎం మీడియాతో మాట్లాడారు. తమ నిర్ణయాలకు ప్రజల మద్దతు ఉందని హుజూర్ నగర్ ఉపఎన్నిక విజయంతో స్పష్టం అయిందన్నారు.

రాష్ట్రంలో ఆర్టీసీ గురించి నా అంత ఎక్కువ తెలిసినవాడు ఎవరూ లేరు.  ఆర్టీసీపై నాకున్న సానుభూతి , అవగాహన ఎవరికీ లేదు. డీప్ స్టడీ చేసి.. కష్టపడి లాభాల్లోకి తెచ్చాను నేను. ఆర్టీసీ సంస్థను ఇంకెవ్వరూ బాగుచేయలేడు. మేం గొంతు కోసుకుంటాం. మేం రాం. అని కార్మికులే అనుకుంటున్నారు. సీఎంనే తిట్టారు. ప్రభుత్వాధినేతనే తిట్టడం ఏమనుకోవాలి. దాని వెనుక ఏమున్నదనుకోవాలి. కార్మికులు,వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాయకులు మాట్లాడాలి. సంస్థే పోతుంటే… యూనియన్లు ఇంకెక్కడివి. మేం బతకాలనుకునేవాళ్లు వెళ్లి డిపోల దగ్గర దరఖాస్తు పెట్టుకోవాలి. 2రోజుల్లో స్టేట్ మెంట్ ఇస్తా. వెయ్యి శాతం చెబుతున్నా ఆర్టీసీ ఇక ఉండదు. ప్రైవేటు బస్సులను ఇంతకంటే తక్కువ చార్జీలతో ఇంత కంటే మెరుగ్గా నడుపుకోవచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ లాభాల్లో ఉంటే… ఆర్టీసీ నష్టాల్లో ఉండటం దేనికి సంకేతం. జీతాలు పెంచి.. ఫిట్ మెంట్ ఇచ్చి.. ఐఆర్ ఇస్తే.. పండగ పూట సంస్థను బంద్ పెట్టి.. కార్మికులే తమ పొట్టకొట్టుకున్నారు. ” అని కేసీఆర్ అన్నారు.

(Visited 134 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *