ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలి: సీఎం కేసీఆర్

CM KCR

రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేయాలని కోరారు. నియంత్రిత పద్ధతిలో వరి పంట సాగు ఈ వర్షాకాలంలోనే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను చర్చించేందుకు ఈ నెల 15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి శ్రీ ఈటల రాజేందర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ బి. వినోద్ కుమార్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, సిఎస్ శ్రీ సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు శ్రీ ఎస్. నర్సింగ్ రావు, శ్రీ బి.జనార్థన్ రెడ్డి, శ్రీ రామకృష్ణరావు, వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ శ్రీ ప్రవీణ్ రావు, హర్టికల్చర్ కార్పొరేషన్ ఎండి శ్రీ వెంకట్రామ్ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ ఎండి శ్రీ కేశవులు, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు శ్ర విజయ్ కుమార్, ఉప సంచాలకులు శ్రీమతి శైలజ, సిఎంఓ కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్ పాల్గొన్నారు.

‘‘అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే నానుడి రాష్ట్రంలో, దేశంలో ఎప్పటి నుంచో ఉన్నది. పండించిన పంట అమ్ముదామంటే అమ్ముడుపోదు, కావాల్సిన వస్తువులు కొందామంటే విపరీతమైన ధరలు ఉంటాయి. ఈ పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది. సేవారంగం, ఐటి రంగం, కొత్త వృత్తులు ఈ మధ్య వచ్చినవి. గతంలో అంతా వ్యవసాయమే. నేరుగా పంటలు పండించే రైతులు, అందులో పనిచేసే వ్యవసాయ కూలీలు, వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో ఉండే వారు ఇలా సమాజంలో 90-95 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతికిన వారే. మన రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం, దేశం వ్యవసాయక దేశం. దేశంలో ఒకప్పుడు తీవ్రమైన కరువు ఉండేది. కీలకనామ సంవత్సరంలో అయితే విపరీతమైన ఆహార కొరత కూడా ఏర్పడింది. తొండల్లాగా బతకాల్సి వచ్చింది. ఈ తర్వాత అనేక పరిణామాలు మారాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ది సాధించాం. ఆహార కొరత లేకుండా అయింది. తర్వాత పరిణామాల్లో రైతు పండించిన పంటకు మంచి ధర రావడం లేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రైతులు పండించిన పంటలకు గౌరవ ప్రదమైన ధరలు రావాలంటే ఏం జరగాలి? అని మనం ఆలోచించుకోవాలి. గతం మాదిరిగానే ప్రభుత్వం ప్రేక్షక వహించి మౌనంగా ఉండాలా? మార్పు కోసం ప్రయత్నించాలా? దురదృష్టం కొద్దీ ఇప్పటి వరకు భారతదేశాన్ని పాలించిన ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం కూడా వ్యవసాయంపై చిత్తశుద్ధితో పనిచేయలేదు. తీవ్ర నిర్లక్ష్యం చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితిలో మార్పు తేవడం కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. చేస్తున్నది. రాష్ట్రంలో గతంలో వ్యవసాయం పరిస్థితి వేరు, ఇప్పుడు వ్యవసాయం పరిస్థితి వేరు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నది. కరెంటు గండం గట్టెక్కింది. సాహసోపేతంగా తలపెట్టిన భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అవుతున్నది. వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తాయి. భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఈ సారి ప్రభుత్వం మొత్తం పంటను కొనుగోలు చేస్తున్నది. దేశం మొత్తం కరోనా ఉన్నప్పటకీ మరే రాష్ట్రంలో ఇలా మొత్తం పంటను కొనుగోలు చేయడం లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే కొనుగోలు చేస్తున్నాము. ఇది తెలంగాణ ప్రత్యేకత. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాభివృద్ది – రైతు సంక్షేమం కోసం కంకణబద్ధమై పనిచేస్తున్నది. ప్రపంచమే తెలంగాణ నుంచి నేర్చుకోవాలని అభిలషిస్తున్నది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

‘‘రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడానికి ప్రధాన కారణం అందరూ ఒకే రకమైన పంటలు పండించడం. మార్కెట్ డిమాండుకు తగ్గట్లు పంటలు పండించాలని నేను ఇవాళ చెప్పడం లేదు. 20 ఏళ్ల క్రితం నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేసినప్పటి నుంచి చెబుతున్నా. ప్రధాని నరేంద్ర మోడికి, గత వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కు పంటల మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటు గురించి అనేక మార్లు చెప్పాను. ఇంతకు మించిన గత్యంతరం లేదు. అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలి’’ అని సీఎం అన్నారు.

‘‘ఏది పడితే అది పండించి, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు పంటలు వేసి, పండిన పంటలు మార్కెట్ కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరు. అంగట్ల సరుకు పోసి ఆగం కావద్దు. డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలి. అమ్ముడుపోయే సరుకే పండించాలి. రైతులు ఏ పంట వేస్తే లాభపడతారో ప్రభుత్వమే పూనుకుని చెబుతున్నది. ఆ పంటలకు మద్దతు ధర ఇస్తామని చెబుతున్నది. ప్రభుత్వం ఇంత చొరవ చూపుతుంటే రైతులకు ఇంకా వేరే ఆలోచన ఎందుకుండాలి. రైతుల ఆలోచనలో మార్పు రావాలి. నిర్మాణాత్మకమైన మార్పులు రావాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

వరిపంటతో మార్పు ప్రారంభం:
——————————————
ఈ వర్షాకాలంలో వరిపంటతో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే పద్ధతి ప్రారంభం కావాలని మంగళవారం జరిగిన వ్యవసాయ సమీక్షలో నిర్ణయించారు. రాష్ట్రంలో ఈ సారి 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించారు. ఇందులో సన్న, దొడ్డు రకాలుండాలని తేల్చారు. పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా రకాన్ని పండించాలని నిర్ణయించారు. ఏ ప్రాంతంలో ఏ రైతులు ఏ రకం పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలను త్వరలోనే ప్రభుత్వం వెల్లడిస్తుంది. ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు ఇవ్వాలని, ఆ పంటలకే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలనే నిర్ణయం జరిగింది.

ఈ వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కందులు పండించాలని నిర్ణయించారు. ఏ పంట ఎక్కడ పండించాలి? ఎంత పండించాలి? అనే వివరాలను అధికారులు త్వరలోనే వెల్లడిస్తారు.
పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో కూరగాయల సాగు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ ప్రాంతంలో ఎంత మేరకు కూరగాయలు పండించాలి? ఏ కూరగాయలు పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలు కూడా రైతులకు ప్రభుత్వం సూచిస్తుంది.

సీడ్ రెగ్యులేటింగ్ అథారిటి ఏర్పాటు:
————————————————
రాష్ట్రంలో కొత్తగా సీడ్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన పంటలనే సాగు చేయాలని నిర్ణయించినందున, ఇకపై విత్తనాలు కూడా ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించినవి మాత్రమే అమ్మాలి. దీనిపై విత్తన తయారీ సంస్థలకు, వ్యాపారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే లభ్యమయ్యేలా విత్తన నియంత్రణ అథారిటీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే ఇప్పుడున్న విత్తన చట్టంలో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీడ్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగ సమావేశం కావాలని సిఎం నిర్ణయించారు.

 

(Visited 6 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కల్తీ, నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ : సీఎం

Tue May 12 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="https://www.kekanews.com/cm-kcr-review-on-telangana-agriculture-2084-2/"></div>కల్తీ, నకిలీలపై ఉక్కుపాదం: ————————————— • నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  పత్తి, మిర్చి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం గ్రహించింది. బుధవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ లు పర్యటిస్తాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెట్టాయి. నకిలీ, కల్తీ విత్తనాలు తయారు చేసే వారిని, అమ్మే వారిని […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="https://www.kekanews.com/cm-kcr-review-on-telangana-agriculture-2084-2/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
CM KCR Agriculture

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..