మనఊరి కథ.. ఆదరిద్దాం.. చూసి ఆనందిద్దాం : మిడిల్ క్లాస్ మెలోడీస్ రివ్యూ

‘మనది మిడిల్ క్లాసు. కోటి సమస్యలు, లక్ష వర్రీసూ ఉంటాయి. సర్దుకుపోవాలి!’ అంటూ మాటిమాటికీ కొడుకుని హెచ్చరిస్తూ ఉంటాడొక తండ్రి. ఆ కొడుకు మాత్రం కరుడుగట్టిన కసాయిల్ని, కండలుతిరిగిన కర్కశుల్ని సైతం చులాగ్గా చితగ్గొట్టేస్తూ ఉంటాడు. కోట్లకు పడగెత్తిన మహల్లో సైతం చాలా క్యాజువల్ గా తిరిగేస్తూ ఉంటాడు. ఇది అసహజం.

 

నిజమైన మధ్యతరగతి అంటే ఏరోజుకారోజు ఏ ఇబ్బందీ లేకుండా బ్రతకడమే ఒక అచీవ్మెంట్ లా భావించే తరగతి.

 

చిన్నచిన్న ఫంక్షన్లప్పుడు ఇడ్లీవడా తెచ్చిన వంటవాడు చెట్నీ మర్చిపోవడం ఎన్నిసార్లు మనిళ్లలో జరగలేదూ?

 

సెల్ పాయింటుల్లో పనిచేసే అమ్మాయిల కోసం వడేసి తిరిగే గోపాలాలైతే బీక్లాస్ ఊళ్లన్నింట్లోనూ ఉంటారు. ఏ అలంకరణా లేని ఆ పిల్ల చాలా దివ్యంగా ఉంది.

 

అలసిన శరీరాన్ని అలా కటికనేలమీద కాసేపు వాల్చి పడుకుంటుంది రాఘవా వాళ్లమ్మ. మొగుణ్ణి కాస్త పాదాలకి నూనె మర్దనా చెయ్యమంటుంది.

 

గోపాల్ ఆరుబయట స్నానం చేస్తూ పళ్లతో షాంపూ ప్యాకెట్ కొరికినట్టు చూపిస్తాడు. ఈలోగా ఫోనొస్తే ఛార్జింగ్ కేబుల్ పీకి మాట్లాడుతుంది వాళ్లమ్మ.

 

నైటీ మీద చున్నీ ఒకటి పడేసుకుని వీధికుళాయి దగ్గర ప్లాస్టిక్ బిందెలతో నీళ్లుపట్టుకునే అమ్మణ్ణుల్ని మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఇందులో సంధ్యని చూస్తే ఆ సహజత్వం మళ్లీ మనకు కనిపిస్తుంది.

 

గొప్పలకుపోయి ఎమ్మెల్యేగా పోటీ చేసేద్దామనుకునే దురాశాపరులు, వాస్తవాన్ని గ్రహించలేక అనవసరమైన అహంకారంలో అలమటించే రాఘవలాంటి కుర్రాళ్లు కూడా మధ్యతరగతిలో కనబడతారు.

 

దర్శకుడు రీళ్లు నింపడమో, కథ సాగదియ్యడమో చేశాడని నేననుకోను. అతనిలోని పరిశీలనాశక్తికి మనం జోతలందించాలి.

 

‘నీ బొంబాయి చెట్నీయేం అంత బాగోదు బావా!’ అన్న డైలాగ్ ఒక్కటి చాలదా… దర్శకుడికి కథానాయకుడి పాత్రమీద ఎంత గ్రిప్ ఉందో తెలుసుకోడానికి?

 

మొదటినుంచీ ఒకరకమైన అహంభావంతో తనంతవారు లేరనుకునే పాతికేళ్ల కుర్రాళ్లందరికీ జ్ఞానోదయం కలిగించేలా ఉంది ఆ సన్నివేశం.

 

సత్యాన్ని గ్రహిస్తే సరిపోదు. ఉన్న వనరులతో ఎలా నెగ్గుకురావాలో కూడా చూపించాడు వినోద్.

 

బొంబాయిచెట్నీలో మావిడికాయో, చింతకాయో కలిపాడని, పోపెందుకు పెట్టాడని అనుకునేముందు వాడు చేసిన చెట్నీని అన్నిసార్లు పారబోశాడన్న విషయాన్ని మనం గమనిస్తే యదార్ధం పదార్ధంలో లేదని బోధపడుతుంది.

 

చేసేపనిలో నిబద్ధత, తీక్షణమైన శ్రద్ధ కనబరిస్తే విజయం సాధించితీరతామన్న సందేశమేగా చివరకు మిగిలేది?

 

గుంటూరా, కొలకలూరా అన్న విషయంలో కూడా వివాదాలు అనవసరమేమో అనిపిస్తుంది. అది మనవూరి కథ.

 

లౌక్యం, జరుగుబాటురోగం, భేషజం, పరోపకారం, మనదైన భాషలో మాట్లాడుకోవడం, కోపమొస్తే వ్యాకరణం… ఇవన్నీ ప్రత్యేకంగా ఒకే జిల్లాకు చెందాల్సిన అగత్యమేమీ లేదు. కథకోసం కుర్రాడు ఓ ఊరిని ఎంచుకున్నాడంతే. ఆ పాట మాత్రం బాలేదు. అనవసరం కూడా!

 

ఆనంద్ భాష మాత్రం అస్సలు నప్పలేదు.

 

ఫిదా సినిమా కోసం పరభాషకు చెందిన సాయిపల్లవిని సానపెట్టి వజ్రంలా తయారుచేసి, తెలంగాణ మాండలికంలో మాట్లాడించగలిగిన శేఖర్ కమ్ముల అడుగుజాడల్లో నడిస్తే ఆనందుడి చేత గుంటూరు యాస పలికించడం కష్టమేమీ కాకపోను. కొంచెం కష్టపడాల్సింది.

 

వర్ష కళ్లతోనే నటిస్తుంది. ’96 లో చూసినప్పుడే అనిపించింది తనకు చాలా మంచి భవిష్యత్తు ఉందని. విజయ్ సేతుపతి శిష్యురాలిగా అతణ్ణి కారులో తెల్లవారుజామున డ్రైవింగ్ చేస్తూ తీసుకెళుతుంది. ఆ సన్నివేశం మొత్తం తన గెస్చర్సన్నీ చాలా సటిల్ గా ఉంటాయి. బొమ్మలా నిలబడి, స్కిన్ షో చేసే బ్యాచ్ హీరోయిన్ కాదు. అదే చెయ్యాలనుకుంటే దర్శకుడికి బోలెడంత అవకాశమున్న కథే ఇది!

 

ఇక కొండల్రావుగా గోపరాజు రమణ తెరమొత్తం ఆవహించేశాడు. అది నటనగా అనిపించలేదు. అలాగే ఆనందూ వాళ్లమ్మ కూడా.

 

‘తల్లో పేలెందుకొచ్చినయ్యే అంటే నీపక్కన పడుకున్నా కదా, ఎక్కుంటయ్’ … అనికూడా రాసేశాడంటే రచయితకీ, దర్శకుడికీ ఎంత కెమిస్ట్రీ వర్కవుట్ అయిందో అర్ధమవుతుంది. ఇది సాధారణమైన విషయం కాదు. వారిద్దరి పరిశీలనాశక్తీ అపారమైనది. ‘పేదవాడి కారు డ్రైవరు కూడా చాలా పేదవాడే..!’ అని రాసే టైపు కాదు వీళ్లు.

 

చాలా తెలుగు సినిమాల్లో మిడిల్ క్లాసుని చూపించడంలో ఘోరంగా విఫలమయ్యారు వినాయకులు, పైడిపల్లులు, కొరటాలలూ! దానికి ఓపిక కావాలి. అనుభవించాలి. ఏడవాలి. దోమలతో కరిపించుకోవాలి. అప్పుడు తెలుస్తుంది మిడిల్ క్లాసంటే ఏంటో!

 

ఇంతకుముందు ఇటువంటి చిత్రాలు వచ్చేవి. కానీ ఎనభైల్లో. ఆ తరువాత రానురాను మన ఆశలకి రెక్కలుకట్టేసి ఊహాలోకాల్లో ఎగిరించేశారు అందరూ.

 

దాదాపుగా ఈమధ్యకాలంలో మృగ్యమైపోయిన సహజత్వాన్ని మనం మెచ్చే రీతిలో ప్రదర్శించిన ఈ సినిమా నిజంగానే ఒక మంచి సినిమా. ఆదరించండి. అభినందించండి.

 

…….జగదీశ్ కొచ్చెర్లకోట

(Visited 46 times, 1 visits today)