మెయిల్ మూవీ రివ్యూ : టచ్ మామూలుగా ఉండదు

Spread the love

(Source : Akhilesh Kasani FB)

మెయిల్..

ఇదొకటి ఉంటదని పదో తరగతి ఒచ్చేదాకా తెల్వదు.. అసలు కంప్యూటర్ చెయ్యితోటి తాకింది సుతం పదోతరగతిలనే.. అదివరిదాంక నెట్ సెంటర్ కు పోవుడు రిజల్టు తెల్సుకునుడు తప్ప చెయ్యితోని ముట్టలే.. ఏడో తరగతి ల అనుకుంట ఫస్టు కంప్యూటర్ ను సూశింది.. అప్పట్ల కంప్యూటర్ ఎవలింట్లనన్న ఉంటే మస్తు గొప్ప.. ఇగ నెట్ సెంటర్ ఓనర్ ను సూస్తే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటె ఈనెనేనా అనుకున్న..

పదో తరగతిల ఒక మేడం ఇంట్ల ఉండి సదువుకున్న.. ఆల్ల ఇంట్ల పెద్ద కంప్యూటర్ సెటప్ ఉంటుండే.. ఒక అర్ర మొత్తం దానికోసమే వెట్టిర్రు.. అల్ల పోరడేమో రెండో తరగతి.. బడికెల్లి రాంగనే దాని ముంగట కుసోని ఏమేమో చేస్తుండే.. నాకేమో అడగాల్నంటే సిగ్గు..నాలుగైదు దినాలైనంక ఆ పిల్లగాడే దగ్గర కుసోవెట్టుకొని కంప్యూటర్ గురించి చెప్పిండు.. ముందుగాల్ల నాకు పెయింటింగ్ ఎట్ల ఎయ్యాల్నో నేర్పుండు.. దానితోని ముందుగాల్ల ఏశింది సూర్యుని బొమ్మ.. దాని సుట్టు గీతలు వెట్టి నాకు మస్తొచ్చొంది అని మస్తు మురిశిన.. అప్పుడే కంప్యూటర్ ని నా శేతులతోని మొదటిసారి ముట్టుకున్న..

పది తర్వాత ఇంటర్ సిద్దిపేట్ల సదివేపటికి అప్పుడప్పుడు నెట్ సెంటర్ కు పొయ్యి ఉత్తగ గెలికుడు అలవాటైంది.. గంటకు పది రూపాలిచ్చి క్యాబిన్ల కుసునేది.. అప్పుడే యాహూ, ఆర్క్యుట్ ఫుల్ ఫాం ల ఉండే.. యాహూ మెయిల్ తయారు చేస్కొని, ఆర్క్యుట్ ల పడి చాట్ చేసుడు అలవాటైంది.. గంట అల్కగ అయిపోయేది.. ఇగ మల్ల జేబుల ఎప్పుడు పది రూపాలుంటే అప్పుడు పొయ్యి నెట్ సెంటర్ల గేం ఆడుతుండే.. అట్ల అట్ల కంప్యూటర్ అంటే భయం పొయ్యింది..

ఇదంత ఎందుకంటే “మెయిల్” సినిమా చూస్తున్నంతశేపు నన్ను నేను చూస్కున్నట్టే ఉంది.. మన తెలుగుల సుతం ఆత్మగల్ల సినిమాలొస్తుంటయని ఈ మధ్యల మరింత నమ్మకం కలిగిచ్చిన సినిమా “కంబాల పల్లి కథలు”.. దీన్ల ఒక్కో పాత్ర ఎంత సజీవంగ ఉందంటే మనం ఒక పదిహేను, ఇరవై ఏండ్ల కింద ఎట్ల ఉన్నమో మనకి మల్లోసారి చూపెట్టింది.. కంప్యూటర్ కు వైరస్ అంటుతదని చెప్పులు ఇడిశేశి పోవుడు నా యాదిలనే ఉంది..

డైరెక్టర్ ఉదయ్ గుర్రాల కు మంచి భవిష్యత్తుంది.. కథను ఎంత మంచిగ చెప్పిండో, పాత్రల స్వభావాలను సుతం అంత మంచిగ మలిశిండు.. కండ్లతోనే చానా భావాలు పలికించిండు.. లీడ్ రోల్ చేశిన పోరడైతే అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లెక్క చేశిండు.. ప్రియదర్శి, రోజాప్రియ అనే కాదు ప్రతి పాత్ర కూడా మనకి ఎక్కన్నో తలిగినట్టు అనిపిస్తది.. ఇగ మా సన్నీ Sunny Palle గాడు ఉన్నంతసేపు నవ్విపిచ్చిండు.. ఇట్లనే మంచి కథలని ఏరుకుంట ఉరుకాలిరా నువ్వు.. మా నరేందరన్న Narendher Goud Naguloori గిన ఉన్న రెండు నిమిషాలైనా ఆగం చేశి పోయిండు..

ఈ నడుమ సినిమాలు మొత్తం చూసుడు తక్వనే.. బుద్దిపుట్టినపుడు అద్దగంట సూశి మల్ల సూడబుద్దైతే సూస్తున్న.. కానీ ఈ సినిమా రెండు గంటలశేపు బీరిపోయ్యి సూశేటట్టు చేశింది.. ఎందుకంటే డీటెయిలింగ్ అట్ల ఉంది.. ఏ చిన్న డీటెయిల్ సుతం ఇడిశిపెట్టలే..

ఇది మనోల్లు నటించిన మన సినిమా.. అందరూ తప్పక చూడుర్రి.. తెలుగు సినిమాను సమాంతర సినిమా స్థాయికి తీస్కపోయ్యే రేంజ్ మన “కంబాలపల్లి కథలు” కు ఉంది..

(Visited 115 times, 1 visits today)
Author: kekanews