హైదరాబాదీలను తన్ని లేపేందుకు మరో శేషన్ రూలు కర్రతో రావాల్సిందే..!

ghmc elections
Spread the love

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC Polling 2020) ఎన్నికల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవడం పట్ల అంతటా అసంతృప్తి వ్యక్తమవుతోంది. వ్యతిరేకత కనిపిస్తోంది. GHMC ఓటర్లపై రాష్ట్రమంతటా విమర్శలు వస్తున్నాయి. ఇంట్లోనుంచి బయటకు వెళ్లలేనివాళ్లకు ఓటు అవసరమా.. ఓటు వేసేలా కఠిన మైన చట్టాలు తేవాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికి తనదైన శైలిలో ఓ ఆలోచనను పరిష్కారంగా చూపుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, రచయిత ప్రసేన్ బెల్లంకొండ. పోలింగ్ శాతం పెంచేందుకు ప్రసేన్ గారుచేస్తున్న సూచన ఏంటో చూడండి.

(Source : Facebook)

ఒక్క హైదరాబాదే కాదు. చెన్నై బెంగుళూరు చివరకు ఢిల్లీ లోనూ ఇదే లెక్క. అత్యధికం 38 శాతం ఓట్లు పోలవుతాయి.
ఐదేళ్ల క్రితం నేనో ప్రతిపాదన చేసాను. అప్పుడు కూడా ఇదే సందర్భం. పట్టణాలలో ప్రజలు ఓట్లువేయడానికి సుముఖంగా లేరని తేలిన వేళ. మరోసారి అదే ప్రతిపాదన చేస్తున్నాను. ఉపయుక్తంగా ఉంటుందని.
ఓటువేసిన తరువాత ఓటరుకో రసీదు ఇవ్వాలి. ఇప్పుడు వివి పాట్ లాంటి స్లిప్ అనమాట. దానిమీద అతను ఎవరికి వేసాడో కాక ఓటు వేసినట్టు మాత్రం అతని వివరాలుండాలి…. ఆ తరవాత అతను లేదా ఆమె బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, కరంట్ మీటర్ కు అప్లయ్ చెయ్యాలన్నా, భూమి రిజిస్టర్ చేయించుకోవాలన్నా, ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకోవాలన్నా, నల్లా కనెక్షన్ కావాలన్నా, ఇంటిపన్ను చెల్లించాలన్నా, విమానం టికెట్ బుక్ చేయాలన్నా, రైలు ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చెయ్యాలన్నా, పిల్లలను బడిలో అడ్మిట్ చేయాలన్నా , ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలన్నా .. ఇటువంటి అనేకనేక సందర్భాలలో ఆ రసీదును ఆయా దరఖాస్తులతో తప్పక జోడించాలనే రూల్ పెట్టాలి.
ఆ రసీదు లేక పొతే అనుమతులు ఇవ్వవద్దు. ఏ పనీ జరగొద్దు. ఆ రసీదు లేకపోతే అన్ని పన్నులు,రుసుములు మూఁడు రెట్లు చెల్లించాల్సి ఉంటుందని నియమం కూడా పెట్టాలి. అప్పుడు తప్పక ఈ సోషల్ మీడియా వీరులు, ఫేస్ బుక్ లో ప్రవచనాలు పలికే డిజిటల్ రాజ్యాంగ కర్తలు పోలింగ్ బూత్ లకు వస్తారు.
సరే.. నిర్భంధ ఓటింగ్ తప్పు అని ఎవరైనా అనొచ్చు, కోర్టులు కూడా జోక్యంచేసుకోవచ్చు…
అయినా ఎక్కువ శాతం పోలింగ్ జరిగేట్టు చూడాల్సిన భాధ్యత కూడా ఎన్నికల సంఘానిదే కనుక, ఎన్నికల సంఘమే ఈ నిర్ణయం తీసుకుంటుంది కనుక చట్టభద్ధత కూడా వచ్చే అవకాశమే ఎక్కువ.
నాది ఒక ముడి ప్రతిపాదన. దీనికి బుద్ధి జీవులు కొన్ని కూడికలు కొన్ని తీసివేతలు చెయ్యొచ్చు. ఇదే కాక పోయినా ఇలాంటిది ఎదో ఒక ఆంక్ష పెట్టకపోతే పరిస్థితి దారికి రాదు.
రాజశేఖర రెడ్డి ఎవరు అని అడిగిన ఒక సాఫ్ట్ వెరర్, రాజ్యాంగంలో ఏముంటది అని అడిగిన మరో సౌఖ్య మేధో పౌరుడు, ప్రధాన మంత్రిని ఎవరు సెలెక్ట్ చేస్తారు అని అడిగిన ఇంకో కంప్యూటర్ నిపుణుడు కూడా నాకు తెలుసు. వాళ్ళను తప్పు పట్టేదేమీ లేదు. తమ చుట్టూ ఉండే అనేక సౌఖ్యాల లేదా అసౌఖ్యాల మూలాలు తమలోనే ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోలేని, లేదా తెలుసుకోవాల్సిన అవసరంలేదని అనుకునే వారి సంఖ్య అతిగా పెరగడమే ప్రధాన సమస్య…
ఎన్నికల సంఘం ఏదో ఒకటి చెయ్యాలి…. నేనైతే మరో శేషన్ ఒక మహా బెత్తం పట్టుకుని అవతరించాల్సిన అవసరం ఉందని కలకంటున్నాను.
(Visited 89 times, 1 visits today)
Author: kekanews