సారీ.. మనోజ్ .. నిన్ను మేమే చంపేశాం!

TV5 Reporter Manoj kumar yadav corona death
Spread the love

కరోనా, ఇతర వ్యాధుల కారణంగా చనిపోయిన TV5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ కుమార్ యాదవ్ పై టీవీ, మీడియా, ప్రింట్ రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎంతోమంది స్పందిస్తున్నారు.  సీనియర్ జర్నలిస్టు, ఎడిటోరియల్ కార్టూనిస్ట్ గంగాధర్ వీర్ల గారి రచన.. కేక న్యూస్ రీడర్స్ కోసం.

———-

ఒక జర్నలిస్టు మరణించెను!
లేదు.. చంపబడెను!!
………………………………………………..

20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో..
ఆ ప్యాకేజీ గురించి ఆర్థిక మేథావులు గీసిన, కొలిచిన బాధిత జాబితాల్లో లేనివాడు..
కరోనాపై ప్రకటించిన యుద్ధభూమిలో.. రియల్ వారియర్స్ లో ఒకడు అని పెద్ద పేరున్నా.. కనీసం సింగిల్ పైసా అయినా తన జీవితానికి బీమా లేనివాడు..
లాక్ డౌన్ ప్రపంచాన.. ‘‘స్టే హోమ్.. స్టే సేఫ్’’ అనే నినాదం ఏమాత్రం పట్టనోడు. చావు భయం తలకెక్కనోడు..
కరోనా చరిత్రను ఔపోషణ పట్టి.. జనుల క్షేమం కోసం తన శ్వేధాన్ని వార్తలుగా దారపోస్తున్నవాడు..
మాస్కుల, గీస్కులు, శానిటైజర్లు అని గిరిగీసుకోకుండా.. ఎకంగా చావుకు ఎదురెళ్ళినోడు..
ఆ.. ఒకే ఒక్కడు.. జర్నలిస్టు మాత్రమే..
….
కరోనా మార్చిన ప్రపంచాన
టీవి, దినపత్రికల వార్తలు లేకుండా ఉండిఉంటే.. మనుషులు ఇంకా బిక్కచచ్చిపోదురేమో..
ఇంట్లో ఉన్నాగానీ.. ప్రపంచాన్నీ బుల్లితెరపైన సమస్తం కనిపించేలా చేసిన
జర్నలిస్టు యోధుడి మరణం.. నిజంగా.. పెద్ద విషాధం.
మిగిలివున్న జర్నలిస్టులకిది చేదువార్త.. తమ బతుకులకు విలువ.. రక్షణ, భరోసాలేదని తేటతెల్లం చేసిన సంఘటన చూసి హడలిపోతున్న వైనమూ ఇదే..
…..
మీడియా యాజమాన్య ఘటోత్కచులారా..
ఇప్పటికైనా మీ మొద్దునిద్ర నుంచి లేవండి..
కరోనాను.. మీరెలానూ ఆపలేరు..
కనీసం మిమ్మల్ని.. మీ సంస్థల్ని నమ్ముకుని బతికేవాళ్ళ ప్రాణాల సంగతి ఆలోచించండి..
ఫ్రంట్ ఆఫీసులో.. శానిటైజర్ బాటిళ్ళు, నెలకో మాస్క్ బిక్షమేసినట్టో విసరడంకాదు..
నీ సంస్థకు బోయూలుగా ఉన్న జర్నలిస్టు ఉద్యోగుల జీవితాల గురించీ సీరియస్ గా.. నిజయాతీగా ఆలోచించండి..
ఇంకా.. ఇంకా ప్రాణాలు పోయాక.. అయ్యో అని దొంగేడుపులు ఏడ్చేకంటే..
ముందే నిద్రలేవాలి…
అవకాశవాద మీడియా రంగాన్నీ,
అలాగే.. జర్నలిస్టు ప్రాణాల గురించి పట్టించుకోని.. ప్రభుత్వాల్నీ నిగ్గుదీయాల్సిన సమయం ఇది.
….
నలుగురు జర్నలిస్టులకు.. పదికేజీల బియ్యం. నాలుగు కేజీల కూరగాయలు పంచిపెట్టి.. ఫోటో ప్రచారం కోసం తహతహలాడం మాని.. కరోనా కాలంలో
సాటి జర్నలిస్టు.. ఆరోగ్యం, సంక్షేమం కోసం మాట్లాడండి..
..
ఇప్పుడు మనకు కావాల్సింది..
చేతిలోకి విదిల్చే.. నాలుగు చుక్కల శానిటైజర్, పనికిరాని మాస్కులు కాదు..
సాటి జర్నలిస్టు సంక్షేమం… ప్రాణరక్షణ కూడా…
..
సారీ మనోజ్.. నీ మరణం..
మన మీడియా సమాజపు డొల్లతనమే..
సారీ.. మనోజ్ .. నిన్ను మేమే చంపేశాం!

– గంగాధర్ వీర్ల
సీనియర్ జర్నలిస్టు, ఎడిటోరియల్ కార్టూనిస్ట్

(Visited 261 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *