(సమాజంలోని అంశాలపై తనదైన అభిప్రాయాన్ని బలంగా వినిపించే Vijay Sadhu ఫేస్ బుక్ వాల్ నుంచి తీసుకోవడం జరిగింది.)
థూ మీ బతుకులు చెడ..!
నాకు ఇప్పటికి బాగా గుర్తు… పరిటాల రవి హత్య తర్వాత కొన్ని రోజులకు అతని సమాధి వద్ద అతని భార్య సునీత కన్నీటి నివాళి అర్పిస్తోంది. రవి మర్డర్ తో పాటు ఆ తర్వాత పరిణామాలను, మొద్దు శీను ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చేసిన ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సునీత చీదరించుకుంది. ఇది అసలు ప్రశ్నేనా…. ప్రేమానుబంధాల విలువ తెలిసినోళ్లు ఎవరు ఇలాంటి ప్రశ్న అడగరు, అయినా భర్త చనిపోతే భార్య ఎంతగా కుంగిపోతుందో మీకు తెలియదా …? అడిగేముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అడగండి అని కోప్పడింది పరిటాల సునీత..
ఇంతకీ ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నేంటో తెలుసా..? మీ భర్తను చంపేసారు, ఇప్పుడు ఆయన లేరు కదా … ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని…!
నెత్తురు మడుగులో కొట్టుకుంటున్న బాధితుడి నుంచి అప్పులు తీర్చలేక ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణం నిలుపుకునే రైతు వరకు, నిర్భయ తల్లి నుంచి దిశ నిందితుడు చెన్నకేశవులు భార్య వరకు… గొట్టాలు పట్టుకున్నోడు, కాగితం ముక్క మీద పెన్ను పట్టుకుని రెడీగా ఉండి జర్నలిస్టుల ముసుగులో ఉన్న ఇడియట్స్ అంతా అడిగే తొలి పనికిరాని ప్రశ్న.. మీరు ఎలా ఫీలవుతున్నారు….? అంతటితోనే ఆగిపోరు.. అప్పటికప్పుడు తప్పెవరిది, ఒప్పెవరిది అని నిర్ణయించేసి…? తీర్పులు ఇచ్చేస్తారు కూడా.