మారిన కాల పరిస్థితుల్లో.. పట్నాలకు ఉద్యోగాలకోసం వస్తున్న నేటితరం యువతీ యువకులకు ఈ ఆర్టికల్ 100శాతం సరిపోతుంది. ఈ వార్త చదివితే వారి గుండె బరువెక్కుతుంది. గుండె లోతుల్లో కనిపించే ఆ తడి… అమ్మ, నాన్నలను గుర్తుచేస్తుంది. కచ్చితంగా చదవండి. ఇది రాసింది ఖాజా ఆఫ్రిది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. వాట్సప్ లో వైరల్ అవుతుంటే.. ఇది కచ్చితంగా అందరికీ చేరాలని మేం పబ్లిష్ చేస్తున్నాం. ఇక చదవండి.
సదువెందుకబ్బిందో..
కడుపునొప్పి లేసిందని 
బడి ఎగ్గొడితే..
కడుపు నింపేది సదువే బిడ్డా అంటివి.
నీకున్న ఆకలి నాకుండొద్దని..
అప్పులు, అవమానాలు 
నా వరకు రావొద్దని..
అక్షరాన్ని అంటగడితివి..
పప్పులకు ఉప్పులేకపోయినా..
యాదో ఉపాయంతో బడి ఫీజు కట్టి.. 
పైసదువులు సదివిస్తివి..
బడి దాటంగనే ఊరు దాటితిని..
ఊరు దాటంగనే ఉరుకులాట షురువాయే..
సదివితే కొలువొస్తది.. కొలువొస్తే 
సంతోషంగా ఉంటానని సెప్పి
పట్నంకు పంపిస్తివి..
నిజంగనే..
నువ్వు సెప్పినట్లు సదువుకుంటే..
ఇజ్జత్ పెరుగతది.. కొలువొస్తది.. బతుకు బాగుంటది.. అందరూ మెచ్చుకుంటరు..
కానీ… 
నువ్వు జెప్పిన ఈ సదువు
మనల్ని ఇడదీసింది కదమ్మా..
నీవు నాయిన పల్లెల ఉంటే నన్ను పట్నంల ఉండేటట్లు చేసింది.. 
ప్రపంచం తెలుసుకుంటానంటివి 
పండుగలకు కలిసుకునేటట్లు చేసింది..
నీవున్నతాన మెతుకు లేదు..
నేనున్నతాన నీవు లేవు.
సదువులో నా బతుకు జూస్తివి..
అది నిన్ను దూరం జేసి నాకు భారంగ మారె..
నువ్వొక్క రోజు ఊరికి పోతేనే..
ఇంటి మూలమీద ఉన్న..
తంబం కాడ నిలబడి ఎక్కిళ్ళు పట్టేటోన్ని..
సిన్నప్పుడు నేను నిలబడ్డ తంబం కాడా..
నిన్ను నిలవేడుతున్నది కదమ్మా ఈ సదువు.
బడికి పోయోచ్చి నీ..
కడుపుల తలకాయ వెట్టి పడుకున్నది 
యాదికొచ్చి
కొలువుకు పోయోచ్చిన నాకు కండ్లల్ల శెరువు నిండుతున్నది..
నేను తినే గిన్నెల 
మెతుకులు కనిపిచ్చినప్పుడు
నీవేమి తిన్నవోనని యాదికొస్తే..
ముద్ద గొంతులకు దిగుతలేదు.
పండుగెప్పుడొస్తదా 
అని నువ్వెదురు జూస్తవ్
అదే పండుగ కోసం
నేను తండ్లాడుతుంటా..
పండగైపోయినంక 
పట్నంకు పోతుంటే.. ఊరి బైట ఉన్న 
ఎర్రమన్ను సూడంగనే ఇల్లలికిన 
నీ చేతులను యాది జేసుకుంట కన్నీళ్లతో 
నా మొఖం కడుక్కుంట ఊరు దాటుతున్నా..
సదువెందుకబ్బిందో అమ్మా నాకు..
నిన్ను, నాయినను దూరం చేసిన 
ఈ సదువు నాకెందుకబ్బిందో
సదువబ్బకపోతే.. సదువబ్బకపోతే.. 
సప్పుడుగాకుండా సాగు చేసుకుంటా మీతోనే సంతోషంగా ఉంటుంటి కదమ్మా..