డిపోలకు వస్తే తాటతీస్తాం.. ఆర్టీసీ కార్మికులకు భారీ షాక్

ts rtc strike cm
Spread the love

కార్మికులపై ఆర్టీసీ, సర్కారు మరో బాంబ్

సమ్మె విరమిస్తున్నాం… రేపు నవంబర్ 26 మంగళవారం నుంచి విధుల్లో చేరుతాం.. అని టీఎస్ఆర్టీసీ కార్మిక జేఏసీ స్వచ్ఛందంగా ప్రకటించినా ప్రభుత్వం, యాజమాన్యం కనికరించలేదు. పైగా.. వారి వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతూ.. సమ్మెను ఉక్కుపాదంతో అణచివేయడమే తరువాయి అనే తీరులో … ఈ సాయంత్రం సీఎం కేసీఆర్ కార్యాలయం నుంచి ఆర్టీసీ ఎండీ పేరుతో  ఓ లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖలో ఏముందో.. ఓసారి చూద్దాం.

“రేపటినుంచి విధుల్లో చేరుతామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. పోరాటం కొనసాగుతుందని చెబుతూనే.. సమ్మె విరమించి విధుల్లో చేరుతామని చెబుతున్నారు. తమ ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఉండదు. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే విధులకు గైర్హాజరై.. చట్టవిరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప.. యాజమాన్యం కానీ.. ప్రభుత్వం గానీ సమ్మె చేయాలని చెప్పలేదు.”

“బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతి ముఖ్యమైన పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారు. వారిష్టం వచ్చినట్టు సమ్మెలోకి వెళ్లి.. ఇపుడు విధుల్లోకి వస్తామని చెప్పడాన్ని రూల్స్ ఒప్పుకోవు. హైకోర్టు చెప్పినట్టుగా… కార్మిక శాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారమే ఆర్టీసీ యాజమాన్యం తర్వాత చర్యలు తీసుకుంటుంది. అప్పటివరకూ అందరూ సంయమనం పాటించాల్సిందే. హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసేవరకు.. చట్టవిరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదు. కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారు. ఇక ముందు కూడా యూనియన్ల మాట విని మరిన్ని నష్టాలు కోరితెచ్చుకోవద్దు.”

“రేపు డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకోవద్దని కోరుతున్నాం. అన్ని డిపోల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షించడం జరుగుతుంది. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే… ప్రభుత్వం గానీ, ఆర్టీసీ యాజమాన్యంకానీ క్షమించదు. చట్టపరమైన చర్యలు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఇదే విషయాన్ని గౌరవ హైకోర్టుకు కూడా చెబుతాం. లేబర్ కమిషనర్ నిర్ణయం వరకు అందరూ ఎదురుచూడాలని కోరుతున్నాం” అని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ సంతకంతో ప్రెస్ నోట్ విడుదలైంది.

కార్మికులు విధుల్లో చేరాలంటే ప్రభుత్వం పలు షరతులు పెట్టాలనుకుంటోంది. యాజమాన్యం వైఖరిపై కార్మికులు రేపు ఎలా రియాక్టవుతారో.. దానిపై ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

(Visited 84 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *