మా వాక్సిన్ ను నీళ్లు అంటారా.. భారత్ బయో ఆవేదన

Spread the love

మా టీకాను మంచినీళ్లతో పోల్చారు.. ఇది ఎంతో బాధించింది: భారత్ బయోటెక్ సీఎండీ

క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే కొవ్యాక్సిన్‌కు కేంద్రం అత్యవసర అనుమతులు జారీ చేసిందన్న ఆరోపణలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ సీఎండీ డా. కృష్ట ఎల్ల సోమవారం నాడు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా టీకా అంశం ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుందని, అయితే ఈ పాలిటిక్స్‌తో తమకు ఏ మాత్రం సంబంధం లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని అనేక మంది భారతీయ కంపెనీలనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘సైన్స్‌యే నాకు ఆక్సిజన్, నేను తమిళనాడుకు చెందిన ఓ రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా కుటుంబానికి వ్యాపారంలో అసలేమాత్రం ప్రవేశం లేదు. మా సంస్థకు టీకాల తయారీలో విశేషానుభవం ఉంది. మా సేవలు ప్రపంచంలోని 123 దేశాలకు చేరుతున్నాయి. బ్రిటన్‌తో పాటూ మొత్తం 12 దేశాల్లో మేం ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాం. భారత్‌లోనూ సృజనాత్మకత ఉంది. ఇదేమీ కాపీలు కొట్టే దేశం కాదు. కేవలం స్వదేశీ సంస్థ అయిన కారణంగా మాపై ఈ స్థాయిలో ఆరోపణలు రావడం భావ్యం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఫైజర్ కంపెనీతో పోల్చుకుంటే తమ టీకా ఏరకంగానూ తక్కువకాదని, కరోనా టీకా తయారీ ప్రక్రియపై ఐదు పరిశోధనా పత్రాలు ప్రచురించిన ఏకైక సంస్థ భారత్ భయోటెక్ అని గర్వంగా ప్రకటించారు. బ్రిటన్‌లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌ను కూడా డా. కృష్ణ ప్రస్తావించారు. బ్రిటన్‌లోని ట్రయల్స్‌‌ను ఎవరూ ఎందుకు ప్రశ్నించరూ..? మా టీకాను ఓ కంపెనీ మంచి నీళ్లతో పోల్చింది. శాస్త్రవేత్త అయిన నన్ను ఇది ఎంతో బాధించింది. మాకు ఇది తగదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

(Visited 63 times, 1 visits today)
Author: kekanews