Son Daughter Property Share dispute India Court Orders : పెళ్లయినా.. కాకపోయినా ఆ కుటుంబంలో కొడుకు ఎంతో కూతురూ అంతే.. వివాహమైందనే కారణంగా ఆమె తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదనటం దుర్మార్గం. పుట్టినింట్లో వివాహిత కూడా ఓ సభ్యురాలే అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.. కొడుకుతో సమానంగా వారికీ హక్కులు వర్తిస్తాయని తేల్చి చెప్పింది. ఓ వివాహిత మహిళ తన పుట్టింటి తరపున కారుణ్య నియామకాన్ని ఆశిస్తూ ఆ దిశగా ప్రభు త్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలువరించింది.
వివాహం చేసుకున్న కుమారుడి విషయంలో లేని అర్హతలు.. అనర్హతలు.. వివాహిత కుమార్తెలకే వర్తించబోవని స్ప ష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో స్వీపర్గా పనిచేస్తున్న వీ జగదీష్ 2013 జూన్ 24వ తేదీన మరణించారు. ఆయన ఇద్దరి కుమార్తెల్లో ఒకరైన సిరిపల్లి అమ్ములు తండ్రి స్థానే తనకు కారుణ్య నియామకాల్లో అవకాశమివ్వాలని అప్పటి ఆలయ ఈఓకు దరఖాస్తు సమర్పించారు. భర్త నుంచివేరుపడి విడిగా జీవిస్తున్నట్లు అధికారుల దృష్టికి తెచ్చారు. అయితే ఆమె భర్తతో విడాకులు తీసుకున్న కోర్టు ధృవీకరణపత్రాలను సమర్పించాలని ఈవో సూచించారు.
భర్త ఆచూకీ తెలీదని నిరాశ్రయురాలైన తనకు ఉద్యోగమివ్వాలని మరోసారి అధికారులకు ఆమె విన్నవించుకున్నారు. ఈ మేరకు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు కూడా వినతిపత్రం సమర్పించారు. అధికారులు స్పందించక పోవటంతో 2021లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది డీవీ శశిధర్ వాదనలు వినిపించారు. 1999లో ప్రభుత్వం జా రీచేసిన 350 జీవో ప్రకారం వివాహమైన కుమార్తె సైతం కారుణ్య నియామకానికి అర్హురాలే అని పిటిషనర్ భర్త కూడా మరణించినట్లు తెలిసిందని కోర్టుకు నివేదించారు. కారుణ్య నియామకం ఉద్యోగమివ్వాలని కోర్టును అభ్యర్థించారు.
దేవాదాయశాఖ తరపున న్యాయవాది జోక్యం చేసుకుంటూ తండ్రి మరణించే నాటికి ఆయనపైనే ఆధారపడి జీవిస్తున్నామనేందుకు తగిన ఆధారాలను సమర్పించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆమెకు వివాహమైందని భర్తతో జీవిస్తోందని చెప్పారు. తండ్రితో కలిసి జీవించటంలేదని తెలిపారు. తన భర్త నుంచి విడాకులు తీసు కున్నట్లు చెబుతున్నారే తప్ప అందుకు తగిన ధృవీకరణపత్రాలు కూడా సమర్పించలేదని నివేదించారు. ఈ కారణంగా ఆమె దరఖాస్తును తిరస్కరించామని వివరించారు. పిటిషనర్ తో పాటు తన సోదరి మోహనకు కూడా తండ్రి బతికున్న సమయంలోనే వివాహం జరిగిందని అయితే తన భర్త 2020లో మృతిచెందినట్లు పిటిషనర్ అమ్ములు అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని మాత్రమే ఇచ్చారన్నారు. దీన్నిబట్టి 2013లో జగదీష్ చనిపోయే నాటికి ఇరువురు కుమార్తెలు ఆయనపై ఆధారపడి జీవిం చటం లేదనేది స్పష్టమవు తోందని వాదించారు. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు సంచలనాత్మక తీర్పునిచ్చారు. పెళ్లయిందనే కారణంగా కుర మార్తెను అనర్హురాలిగా పరి గణిస్తున్నారని, అదే కుమారుడి విషయంలో లేని అనర్హత ఆమెకు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ వివక్షే అవుతుందన్నారు. పెళ్లయినా.. కాకపోయినా జీవితాంతం వారు ఆ కుటుంబంలో భాగస్వాములే అవుతారని వివాహం జరిగిందనే కారణంగా ఆమెను కుటుంబ సభ్యురాలు కాదనటం దుర్మార్గమని స్పష్టం చేశారు.