సుశాంత్ ను ఉరికి వేలాడదీసిన 50 కలలు

Sushant Singh 50 Dreams
Spread the love

50-కలలు

ఎప్పుడో ఒకప్పుడు మనమూ పోతామని తెలిసి బతకడమే జీవితం.. బతికినంత కాలం జీవితానికి అప్పుడప్పుడు గుప్పెడంత ఆనందం, వేలెడంత బాధ, చిటికెడు ఈర్ష్య, గోరంత అమోమయం, చెప్పలేనంత నిరాశ, కావల్సినంత అత్యాశ, కనికరం లేని కష్టాలు, కొలవలేనన్ని కన్నీళ్లు ఇలా జీవితంలో ఎన్నెన్నో.. మధ్యలో కుట్రలు, వెన్నుపోట్లు అదనం.. ఎవర్నో అడిగి ఈ భూమ్మీదకు రాలేము..ఎవరికో చెప్పిమట్టిలో కలిసిపోలేము.. అంతా అదేదో తెలీని మాయ.. ఈ విచిత్రమైన జీవితాన్ని అందరూ నెట్టుకొస్తూనే ఉంటారు ఎలాగో ఒకలా…బతుకు బండిని లాగుతూనే ఉంటారు…

కానీ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య గురించి తెలిశాక ఆత్మహత్యలపై మరోసారి చర్చ మొదలైంది. అమ్మా..నాన్న ఇచ్చిన జీవితాన్ని ఎలా వదులుకుంటారు. సొంతంగా ఊపిరి తీసుకోవడానికి ఎంతమానసిక స్థైర్యం కావాలి.. తొలిపొద్దు పొడిచాక మొదలయ్యే జీవితం.. పొద్దుపోయాక గూటికి చేరి.. పొద్దస్తమానం ఏం చేశామో అని ఆలోచించుకుని నిద్రపోతే మళ్లీ పొద్దుపొడిచేనాటికి ఉంటుందో ఊడుతుందో తెలీని ప్రాణం.. మనది..అలా పోతే పర్వాలేదు కానీ సొంతంగా గొంతుకి తాడు కట్టి గిలగిలా కొట్టుకుని కొట్టుకుంటున్న గుండెని బలవంతంగా ఆపేయడమంటే ఎంతటి కష్టం.. గుండె లోతుల్లో ఏదో భయంకరమైన పరిష్కారం లేని బాధ అయ్యుండొచ్చు..ఎవరికీ చెప్పుకోలేని సమస్య అయ్యుండొచ్చు..తీవ్రమైన మానసిక ఒత్తిడి అయ్యుండొచ్చు… ఏదైనా సరే.. అర్థాంతరంగా జీవితాన్ని ముగించడం దీనికి ముగింపుగా బావిస్తుంటారు చాలామంది.. అందులో సుశాంత్ సింగ్ కూడా ఒకరు..

చావు పిలుపు.. అనేక రకాలుగా ఉంటుంది..మృత్యువు యమపాశంతో మన ఇంటి గుమ్మం ముందు నిలబడి రోజుల తరబడి తనతో రమ్మని వేధిస్తుంటే.. మానసిక ప్రశాంతత దొరక్క ఆ ఆహ్వానాన్ని అందుకునే వారు చాలామంది.. తిండికి లేక,.అప్పులు భరించలేక, అనుకున్నది సాధించలేక, జీవితం లో ఓడిపోయామనే బాధ, తనకెవరూ లేరనే నరకయాతన, ప్రేమించిన ప్రియురాలు నట్టేట ముంచేసి పోతే తట్టుకోలేని గుండెకోత ఇలా ఎన్నెన్నో కారణాలతో చాలామంది ప్రాణం తీసుకుంటూ ఉంటారు.

కానీ సుశాంత్ సింగ్ కు ఏం లోటు. పుట్టాడు..గెలిచాడు….. చిన్నవయసులోనే స్టార్ హీరో ..అయ్యాడు..కొన్ని కోట్ల మంది డ్రీమ్ అది.. అతనికున్న ఐడెంటిటీ, అతనికున్న ఫాలోయింగ్ ఎంతమందికి ఉంటాయి..చేసిన 12సినిమాల్లో అందులో ప్లాపులు కంటే హిట్ లే ఎక్కువ.. కావల్సినంత డబ్బు ఉంది…ఇంకెన్నో అవకాశాలున్నాయి.. అయినా సరే ఏదో లేదు..ఇంకేదో అనుకున్నది అవలేదు.. ఏదేదో మనసుని వేధిస్తోంది… గుమ్మం దగ్గర నిల్చున్న మృత్యువుతో అది స్నేహం చేస్తోంది..అదే నిద్ర లేకుండా చేస్తోంది…ఏంటది… అది తెలుసుకునే ప్రయత్నంలోనే సుశాంత్ ఊపిరిని ఆపేసుకున్నాడు..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సెలెబ్రిటీ.. కాబట్టి ఇక్కడ అతని గురించి రాయడం లేదు..ప్రాణం ఎవరిదైనా ప్రాణమే.. ఆత్మహత్య చేసుకునే ప్రతి ఒక్కరి గురించి మస్తిష్కంలో , గుప్పెడంత గుండెలో దాగి ఉండే డిప్రెషన్.. దాన్ని కనిపెట్టడానికి ఇంతవరకూ చేయని పరిశోధనలు లేవు.. కానీ పరిష్కారం దొరకలేదు…దానికి తాత్కాలికంగా మెదడుని ఆలోచనల పరంపర నుంచి తప్పించి నిద్రించేలా చేయడానికి మానసిక వేత్తలు మందులు ఇస్తారు కానీ పరిష్కారం చూపలేరు… అందులో ఈ ఆత్మహత్యలు తరతరాలుగా ఆగడం లేదు.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి డిప్రెషనే కారణమా లేక ఇంకా ఏవైనా ఉన్నాయా..అనేది మనకి తెలీదు..కానీ ఏదో భయంకరమైన కారణమే ఉంది…అది టన్ను ల కొద్దీ మనసులు నిండిపోయి బరువు మోయలేక ఊపిరికి అడ్డుకట్టవేసింది.

సుశాంత్ రాసుకున్న…50డ్రీమ్స్ లిస్టు చదివాక చాలామందికి కన్నీళ్లు ఆగకపోవచ్చు.. అతని ఆశలు, అతని కోరికలు, అతని ఆశయాలు, అతను చేయాలనుకున్న సేవలు అన్నీ ఇప్పుడు అతనితో పాటే వెళ్లిపోయాయి.. సుశాంత్ స్వహస్తాలతో రాసుకున్న ఆ కలల లిస్టు చదివితే అది మనం రాసినట్టే ఉంటుంది ..ఇది మనం మనసులో రాసిపెట్టుకున్న లిస్టుని ఇలా.. సుశాంత్ ఎప్పుడో దొంగిలించాడు అనిపిస్తుంది.

మహిళలకు ఆత్మరక్షణకు శిక్షణ ఇవ్వాలి…ఉచిత విద్యను అందించాలి.. అంతరిక్షం గురించి పిల్లలకు నేర్పించాలి…గాల్లో విమానం ఎలా ఎగురుతుందో తెలుసుకోవాలి..ఎడమ చేతితో క్రికెట్ ఆడాలి..ఛాంపియన్ తో టెన్నిస్ ఆడాలి..వేయి మొక్కలు నాటాలి..చదువుకున్ కాలేజీ హాస్టల్లో పాత స్నేహితులతో కలిసి గడపాలి..ఇస్రోలో-నాసాలో వర్క్ షాప్ లకు కనీసం వందమంది పిల్లలనైనా పంపాలి..ఇవే అతని డ్రీమ్స్..ఇందులో సుశాంత్ ఎంజాయ్ చేసేవాటి కంటే వేరేవాళ్లకి ఏదో చేయాలనుకున్నవే ఎక్కువ…

కానీ అతని కలలు అన్నీ నెరవేరాయో.. లేదో..ఇంతలోనే అతని జీవితం ముగిసిపోయింది.. నీ నటన ప్రత్యేకం..నీ జీవితం ఆదర్శం… నీ ఎదుగుదల మాకు ఒక పాఠం…కానీ నీ ముగింపు మాత్రం మాకు….అర్థం కానిది…పోయిరా… సుశాంత్ …………………అశోక్ వేములపల్లి..

(Visited 143 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *