చలాన్లు పోయి.. హెల్మెట్లు వచ్చాయి. రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు యూటర్న్ తీసుకున్నారు. చలాన్లు భారీగా పెంచి చంపేస్తున్నారురా బాబోయ్ అనుకుంటున్నవారికి గుడ్ న్యూస్ చెప్పారు. కొద్దిరోజుల పాటు చలాన్లకు బ్రేక్ వేస్తున్నట్టు చెప్పారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. డీజీపీ, రాచకొండ కమిషనర్ ఆదేశాలతో ఈ నిర్ణయం అమలుచేస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.
చలాన్లు వేయకుండా.. రూల్స్ పాటించని వారితో వాటిని పాటించేలా చేస్తున్నామని చెప్పారు పోలీసులు. హెల్మెట్ లేనివారితో హెల్మెట్ కొనిపించడం, వెహికల్ ఇన్సూరెన్స్ చేయని వారికి ఇన్సూరెన్స్ చేయించడం, పొల్యూషన్ చెక్ చేయని వారికి ఆ సర్టిఫికెట్ తీయించి ఇవ్వడం, లైసెన్స్ లేనివారికి లర్నింగ్ ఇప్పించడం లాంటివి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్.. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు మంచి స్టెప్ తీసుకున్నారని ప్రశంసించారు.
