తెరపై ఇంటి పాత్రలు.. కదిలించే సన్నివేశాలు.. మిడిల్ క్లాస్ మెలోడీస్ రివ్యూ

మూడేళ్ల క్రితం మాట… అప్పటికే వాడు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసి తన భావాలకు దృశ్య రూపం ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. సినిమా తీయాలని కలలు కంటున్న రోజులవి. ఓ రోజు మధ్యాహ్నం నన్ను ,పిల్లలను, మా అక్క పిల్లలను కూర్చోపెట్టి ఓ కథ చెప్పడం మొదలుపెట్టాడు. గుంటూరులో హోటల్ పెట్టి సక్సెస్ అవ్వాలనుకుంటున్న ఓ హీరో కథ. మధ్యతరగతి జీవితాలు, వాళ్ల చుట్టూ ఉండే ఎమోషన్స్ అన్నీ చెప్పుకుంటూ పోయాడు. వాడు చెప్పే కథ వింటూ వింటూ కథతో పాటే మేం కూడా గుంటూరు పొలిమేర వరకు ప్రయాణం చేశాం…మిడిల్ క్లాస్ మెలొడీస్ పేరుతో ఈ కథను సినిమా తీయాలనుకుంటున్నా అన్నాడు… బాగుంది రా….మంచి కథ అంటూ వాడిని అభినందించినా….నా సందేహాలు నాకున్నాయి. హీరోయిజం చుట్టూ కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో సాగే రచ్చ చుట్టూ తిరుగుతున్న సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి ఓ మిడిల్ క్లాస్ కథకు స్కోప్ ఉంటుందా…అన్న డౌట్ నాది. సరే భిన్నమైన కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్న రోజులివి. ఈ కథలో కూడా వీక్షకులను టచ్ చేసే ఎమోషన్స్ చాలా ఉన్నాయనిపించింది. హిట్టా..ఫట్టా తెలియదు కానీ… ఓ మంచి గుర్తుండి పోయే సినిమా అయితే వీడు తీయగలడు అనుకున్నా. మూడేళ్లు ఇట్టే గడిచిపోయాయి. వీడి సినిమాలో హీరో పాత్రకు తగ్గట్టే వీడు కూడా… మిడిల్ క్లాస్ మెలొడీస్ ను తెరకెక్కించడానికి సగటు మధ్యతరగతి మానవుడు పడే సినిమా కష్టాలన్నీ ఫేస్ చేశాడు. మంచి కథ ఉంటే సరిపోదు…. దాన్ని వర్క్ అవుట్ చేయడానికి అంతే అభిరుచి ఉన్న నిర్మాతలు కూడా దొరకాలి.@Vinod Anantoju కథ రాసుకున్నప్పుటి నుంచి.. ఎంతో మందిని కలిశాడు.. కథ చెప్పాడు… కొందరు బాగుందన్నారు…మరికొందరు అగ్రిమెంట్ పై సంతకం వరకూ వచ్చారు…తన కథని సినిమాగా తెరపై చూపించే ప్రయత్నంలో కిందామీదా పడ్డాడు. ఓపిగ్గా ఎదురుచూశాడు..చివరకు

అనుకున్నది సాధించాడు.

 

ఇంటి నిండా బండెడు పుస్తకాల మధ్య పుట్టి పెరిగిన Vinod Anantoju పుస్తకాలతో పాటు సమాజాన్ని కూడా చదివాడు…జీవితాలను దగ్గరగా చూశాడు…వాడి మెదడులో ఎప్పుడూ ఏదో పురుగు తొలుస్తూనే ఉంటుంది. ప్రపంచీకరణ నుంచి సామాజిక, ఆర్ధిక అసమానతల వరకు… మూఢత్వం నుంచి హేతువాదం వరకూ వాడికంటూ ఓ నిశ్చితాభిప్రాయం ఉంది.. అందుకే “మనిషిని మనిషి పట్టించుకోని సమాజం…స్మశానంతో సమానం ” వంటి పదునైన మాటలు వాడి కలం నుంచి వస్తాయి. షార్ట్ ఫిల్మ్స్ లోనైనా…సినిమాలోనైనా…వాడు ఎంచుకున్న పాత్రలు నేల విడిచి సాము చేయవు. సహజత్వానికి దగ్గరగా.. మనలో ఒకరిగా… ఉంటాయి. మూడేళ్ల క్రితం వాడు కథగా చెప్పిన పాత్రలు…ఇప్పుడు సినిమాలో అంతే సహజత్వంతో కనిపించాయి. ప్రతి పాత్ర, సన్నివేశంపై Vinod Anantojuఎంత క్లారిటీతో ఉన్నాడో… సినిమా చూశాక అర్ధమైంది. మిడిల్ క్లాస్ మెలెడీస్ వాడి థాట్ ప్రాసెస్ ను ఆవిష్కరించింది. సినిమా చూస్తున్న భావన కంటే మన చుట్టూ ఉన్న మనుషులతో మనం మాట్లాడుతున్నామా అన్నంతగా ప్రేక్షకుడిని కనెక్ట్ చేయగలిగాడు. లాంగ్వేజ్ అర్ధంకాకపోయినా…కొన్ని మలయాళ సినిమాలు చూస్తున్నప్పుడు వాటిలో మనం లీనమైపోతాము. పాత్రలు మనల్ని వాటితో పాటే తీసుకెళ్తాయి.. అలాంటి భావన మిడిల్ క్లాస్ మెలెడీస్ చూస్తుంటే కలిగింది.

 

కష్టాలు, కన్నీళ్లతో బతుకులను ఈడ్చుకొచ్చే మిడిల్ క్లాస్ జీవితాల్లో అంతర్లీనంగా ఉండే ప్రేమ, ఆప్యాయతలను మనసుకు హత్తుకునేలా చూపించాడు. బండెడు కష్టంతో నీరసించి అలసిపోయి పడుకున్న భార్యకు కాళ్లు పట్టే భర్త సన్నివేశం… మధ్యతరగతి జీవితాలకు దగ్గరగా ఉంది. దేవుడి ఫోటోనో, సందేశాన్నో షేర్ చేస్తే… సాయంత్రంలోపు మంచి జరుగుతుంది అనే జనాల పిచ్చి నమ్మకాలను కొండలరావు పాత్రలో చూపించాడు. జాతకాలను నమ్ముకుని జీవితాలను నాశనం చేసుకునే వారి తీరు గోపాల్ పాత్రలో కనిపించింది. పెన్షన్ డబ్బులను పాలవాడికి అప్పుగా ఇచ్చేటంత మనసున్న మంచి మనుషులు మన చుట్టూ కూడా కొందరుంటారు. కొండలరావు భార్య పాత్ర పోషించిన సురభి ప్రభావతి గారిని చూస్తుంటే… మన అమ్మో…అత్తో గుర్తుకు రాకమానరు.

 

మొత్తంగా మిడిల్ క్లాస్ జీవితాలను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడంలో మా Vinod Anantoju గాడు సక్సెస్ అయ్యాడు. సినిమా బలాలు, బలహీనతలు జోలికి నేను పోవడం లేదు. ఇది మిడిల్ క్లాస్ మెలొడీస్ రివ్యూ కాదు…ఆ పని ఇప్పటికే చాలా మంది చేసే ఉంటారు.

 

ఏడెనిమిదేళ్ల క్రితం ఇట్లు మీ రూపాయి అంటూ… మానవసంబంధాలను చూట్టేసిన రూపాయి కథను ఆవిష్కరించడం నుంచి…ఇవాళ మిడిల్ క్లాస్ మెలొడీస్ పేరుతో… మన ఇంటి పాత్రలను తెరపై చూపించడం వరకూ… వినోద్స్ జర్నీ ఈజ్ ఫినామినల్

 

డియర్ Vinod Anantoju భిన్నమైన ఆలోచనలతో నీ సినీ ప్రయాణం మరింత దిగ్విజంగా సాగాలని కోరుకుంటూ…

-Phani Kumar A()

#MiddleClassMelodies

#AnandDeverakonda

#VarshaBollamma

#BhavyaCreations

(Visited 33 times, 1 visits today)