నాలుగోస్థంభానికి చెదలు పట్టింది.. ఇదీ నేటి మీడియా

ఇది నేటి మీడియా

ఉత్తుత్తి మాటలను ఉద్యమాలుగా మార్చగలదు
ఉద్యమాలను ఉధృతం చేయగలదు
ఉన్నది లేనట్టుగా,లేనిది ఉన్నట్లుగా చూపించగలదు
అనవసరమైన విషయాలను ఆకాశానికి ఎత్తేయగలదు
అవసరమైన విషయాలను అంధకారంలో దాచగలదు
రౌడీలను హీరోలను చేయగలదు
హీరోలను బికారీలను చేయగలదు
బలవంతున్ని అతి బలవతుండిగా చేయగలదు …… బలహీనున్ని చేయగలదు
బలహీనునికి బతుకే లేకుండా చేయగలదు
మోసం నుంచి పుట్టిన ఐడియానే ఈ మీడియా
ప్రజల పక్షమని గొప్పలు చెప్పుకుంటుంది
ప్రజలే దేవుళ్లంటుంది
ప్రభుత్వానికి, ప్రజలకు వారధులమంటుంది
ప్రజలనే అమ్ముకుంటుంది….
సాక్ష్యాలను కష్టపడి సేకరిస్తుంది
కష్టపడ్డోడి కష్టాన్ని అవలీలగా అమ్మకానికి పెడుతుంది
రాజకీయాలను మించింది
మంచితనాన్ని ముంచింది ఈ మీడియా
మీడియాలో మోసం మించి పోయింది
వంచన రాజ్యమేలుతుంది
వంచించినోళ్లకి వంత పాడుతోంది
డబ్బు కోసం అధర్మాన్ని ఆశ్రయిస్తుంది
రేటింగ్ ల కోసం అన్యాయానికి ఆశ్రయమిస్తోంది
ఆయుధాలుగా ఉన్న అక్షరాన్ని నాశనం చేస్తోంది
అసత్యాన్ని గెలిపిస్తోంది
విశ్వసనీయతను పక్కనబెట్టింది
లక్ష్యాత్మకను తుంగలో తొక్కింది
పారదర్శకతను పత్తా లేకుండా చేసింది
బెదిరిస్తుంది ………భయపెట్టిస్తుంది
బతిమాలుతుంది……బతుకును బజారు కీడిస్తుంది
మైకు వెనుక మోసాలు చేస్తుంది
ఐడీల వెనుక బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తుంది
లోగోను అడ్డుపెట్టుకొని లా ను లొంగదీస్తుంది
అదే వారి ధైర్యమని విర్రవీగుతుంది
మీరే దిక్కనుకొన్న వారిని అవసరమైతే నడిరోడ్డులో వదిలేస్తుంది
అవసరమే లేదనుకుంటే గాలికొదిలేస్తుంది
టీఆర్పీ కోసం ఎంఆర్పీని అడుగుతుంది
ఎంఆర్పీ కోసం న్యూస్ ను మార్పిడి చేస్తుంది
డబ్బుల మీద మోజు పడింది
ఎదగాలన్న ఆశతో ఆకలిమీదుంది
విశ్వసనీయతను విధికి వదిలేసింది
విధిగా వీధులవెంట తిరిగినోడ్ని వీధి పాలు చేస్తోంది
తప్పుచేసిన వాడిని తలెత్తుకు తిరిగేలా చేస్తుంది
గుండెలు బాధుకున్నోడికి గుండెకోత మిగుల్చుతుంది
ఓ వైపు జీతాలివ్వకుండా,
మరో వైపు విశ్రాంతి లేకుండా..
ఇంకో వైపు సరిగా ఛానళ్లు నడపకుండా
మాయమంత్రాలు, కుట్రలు కుతంత్రాలతో
ఇంకెన్నాళ్లు కాలం వెళ్లదీస్తుందో
నాలుగోస్థంభానికి చెదలు పట్టింది
భధ్రత లేని ఉద్యోగాలతో,
భరోసా లేని జీవితాలతో ఎంతకాలం ఈ బంతాట
దీన్ని నమ్ముకుంటే భద్రత లేదు….భరోసా లేదు…భవిష్యత్ అంతకన్నా లేదు.
ఇది నేటి తరం మీడియా
ఇది నేను చూసిన మీడియా

ఇట్లు
గోపాల్ రావు
జర్నలిస్టు

(Visited 31 times, 2 visits today)