జార్జిరెడ్డి రివ్యూ : బయోపిక్ కాదు.. కమర్షియల్ సినిమా

George Reddy Review And Rating3
Spread the love

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డిపై సినిమా అనగానే ఒక్కసారిగా ఇండస్ట్రీలోనూ, రాజకీయ, విద్యార్థి, సామాజిక వర్గాల్లోనూ ఓ ఆసక్తి, ఓ అలర్ట్ కనిపించాయి. ఐతే.. ఈ సినిమాలో.. రాజకీయ, విద్యార్థి, సైద్ధాంతిక రాజకీయాల్లో లోతుగా డిస్కస్ చేయలేదు. ఇది ఒక రకంగా.. సేఫ్ గేమ్ ఆడినట్టుగానే చెప్పొచ్చు.

కమర్షియల్ సినిమానే

జార్జిరెడ్డి కథే ఓ పెద్ద వివాదం. ఆయన జీవితం ఓ సంచలనం. కొందరికి ఆదర్శవంతం. మరికొందరికి ఉన్మాద అరాచకం. 1960ల కాలంలో.. క్యాంపస్ లో అన్యాయాలను ఎదిరించి… ప్రశ్నించే తత్వం ఒంటపట్టించుకుని.. వామపక్ష భావాలవైపు ఆకర్షితుడై… చేగువేరా జీవితం స్ఫూర్తితో నాయకుడిగా ఎదిగిపోవాలనుకున్న విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితం అర్థాంతరంగా ఎలా ముగిసింది అనేదే ఈ సినిమా కథ. ఐతే… ఈ సినిమాను… జార్జిరెడ్డికి కాంగ్రెస్, కమ్యూనిస్టు రాజకీయ పార్టీల మద్దతు.. విద్యార్థి సంఘాల పాలిటిక్స్ తో డీప్ గా చర్చించకుండా… పైపైన మాత్రమే టచ్ చేసి తీర్చిదిద్దారు. అందుకే.. డైరెక్టర్, మేకర్స్ సేఫ్ గేమ్ ఆడారని అనిపించింది. అందుకే.. దీనిని ఓ బయోపిక్ అనలేం. మేకింగ్ ను తప్పుపట్టలేం. ఇదో పక్కా కమర్షియల్ సినిమా మాత్రమే.

హైలైట్స్..

  • జార్జిరెడ్డిలో మెయిన్ హైలైట్ క్యారెక్టర్ల ఎంపిక. మెయిన్ లీడ్ సందీప్ మాధవ్.. జార్జిరెడ్డి పాత్రకు బాగా సూటయ్యాడు. అతడి బాడీ లాంగ్వేజ్.. కళ్లలో చురుకు పర్ఫెక్ట్. అతడి వాయిస్ ఒక్కటే కాస్త లో-టోన్ తో వినిపించింది. కానీ రియలిస్టిక్ గా ఉంది. క్లైమాక్స్ సీన్ లో అతడి పెర్ఫామెన్స్ కు వంక పెట్టలేం.
  • బాక్సర్ అయిన జార్జిరెడ్డి.. ఆయుధాలు వాడటంలో దిట్ట అనే పేరుంది. అది సినిమాకు కమర్షియల్ గా బాగా వర్కవుటయ్యింది. ఫైర్ బాల్ కు బెల్ట్ తగిలించి హీరో జార్జిరెడ్డి చేసే ఫైట్ సినిమాకే హైలైట్. శివ(సినిమా అప్పటికి రాలేదు)లో సైకిల్ చైన్ సీన్ కు ఇదే ఇన్ స్పిరేషన్ అని టాక్. బ్లేడ్స్ ను కర్చీఫ్ కు తగిలించి చేసే ఫైట్ కూడా బాగుంటుంది. నికిల్ డస్టర్ సహా పలు ఆయుధాలను హీరోతో వాడించారు. తన చేతికి వచ్చిన గన్ ను మాత్రం జార్జిరెడ్డి వాడడు. అదివాడితే చరిత్ర మరోలా ఉండి ఉండేది అనే డైలాగ్ గుర్తుండిపోతుంది.
  • ఒక్కొక్కొరూ యాక్టింగ్ ఇరగదీశారు. ఏబీవీపీ(సినిమాలో ఏబీసీడీ) లీడర్ సత్యదేవ్ పాత్ర పరిధి తక్కువే అయినా.. ఆయన ఇంప్రెషన్ మూవీలో కనిపిస్తుంది. రెగ్యులర్ నటులను తీసుకుని ఉంటే ఈ ఫీల్ వచ్చేదే కాదు. ఇలాంటి సినిమాలు వేరేభాషల్లో అప్పుడప్పుడూ వస్తుంటే సూపర్ అంటుంటాం.
  • లలన్ అనే ప్రధాన విలనీ పాత్రలో తిరువీర్ ఆకట్టుకున్నాడు. బస్తీల్లో కబ్జాలకు పాల్పడే ఓ గూండా తమ్ముడిగా, జార్జిరెడ్డి అవమానించాడనే భావనతో సైకిక్ వైబ్రేషన్ తో ఊగిపోయే పాత్రలో ఆయన నటించాడు.
  • ఆర్ఎక్స్ 100 తర్వాత.. మీసాల లక్ష్మణ్ మరో ఆకట్టుకునే పాత్ర చేశాడు. ఏబీవీపీ బృందంలో ఓ నాయకుడిగా కథను మలుపు తిప్పే పాత్రచేశాడు. లలన్ ను జార్జిరెడ్డిపైకి ఉసిగొల్పే పాత్రలో కనిపించాడు.
  • తెలంగాణ ఫ్లేవర్. మ్యాగ్జిమమ్ నటులు తెలంగాణ యాసలో, మన వాడుక భాషలో మాట్లాడుతుంటారు.
  • ఫైట్లు రియలిస్టిక్ గా ఉంటాయి. నిజంగానే కాలేజీ క్యాంటీన్ లో, గ్రౌండ్ లో కుర్రాళ్లు కొట్టుకున్నట్టుగా ఉంటుంది. అసలు సినిమా చూసినట్టు ఉండదు.
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సురేష్ బొబ్బిలి అండ్ టీమ్ దుమ్ములేపేశారు. ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోరు వింటుంటే.. ఊపు వస్తుంది. మూవీ జానర్ కి, మూవీ కాలానికి తగ్గట్టుగా మ్యూజిక్ అందించాడు సురేష్ బొబ్బిలి. చివరిదైన అమ్మపాటలో సాహిత్యం బాగుంది.
  • ఓయూతో అనుబంధం ఉన్న ప్రతి స్టూడెంట్ ఈ మూవీకి కనెక్ట్ అవుతాడు.

ప్రతి ఫ్రేమ్ లో కనిపించే దర్శకుడి టాలెంట్

డైరెక్టర్ జీవన్ రెడ్డి. ఈ సినిమాకు డైరెక్షనే ప్రధాన అసెట్. ప్రతి ఫ్రేమ్ లో అతడి కష్టం, సినిమాటోగ్రాఫర్ సుధాకర్ రెడ్డి, యెక్కంటి, ఆర్ట్ డైరెక్టర్ పనితనం కనిపిస్తుంది. ఎన్నో లాంగ్ డ్యూరేషన్ షాట్లు తెరపైనుంచి దృష్టిమరల్చనీయవు. క్యాంపస్ క్యాంటీన్లో ఫైట్, లలన్ ప్రతీకార ప్రతిజ్ఞ చేసే సీన్, క్లైమాక్స్ గుంపులుగుంపులుగా విద్యార్థులు గ్రౌండ్ లోకి వచ్చి కొట్టుకునే సీన్, ఫైర్ బాల్ ఫైట్ హీరో ఎలివేషన్ సీన్స్.. ఇవన్నీ హైలైట్స్ గా చెప్పుకోవాలి.

ఫైనల్ టచ్

కాంగ్రెస్ విద్యార్థి సంఘం మద్దతుతో ఎదిగిన కమ్యూనిస్టు భావాలున్న విద్యార్థి నాయకుడు… ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన ఘర్షణలో చనిపోయాడా…? లేక.. అవమాన భారం భరించలేని ఓ గూండా తమ్ముడు చంపేశాడా…? లేక నమ్మిన స్నేహితుడే నమ్మకద్రోహం చేసి జార్జిరెడ్డిని శత్రువులకు అప్పగించాడా..? ఇవి  జార్జిరెడ్డి హత్య విషయంలో ఉన్న మిస్టరీ అంశాలు. వాటిలో ఏది దర్శకుడు క్లైమాక్స్ కు ఎంచుకున్నాడనేది సినిమా చూసి తెల్సుకోవాలి. జార్జిరెడ్డి చనిపోయినప్పుడు ఏబీవీపీలోనే ఓ ప్రధాన నాయకుడు కంటతడి పెట్టడం.. మరో నాయకుడు నవ్వుతూ ఉండటం.. దర్శకుడు ఎంచుకున్న సేఫ్ గేమ్ లో భాగం కావొచ్చు.

Read Also :

ఎన్టీఆర్ హీరోయిన్ కు ఓవర్ నైట్ లో పిచ్చ ఫాలోయింగ్

(Visited 93 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *