బీజేపీకి దొరికిన ఒక్క మగాడు… బండి సంజయ్

bandi sanjay

అసెంబ్లీ ఎన్నికల్లో సోదిలో లేదు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సప్పుడే లేదు.

మున్సిపల్ ఎన్నికల్లో హంగామా చేయలేదు.

ఐనా… రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చాడన్న వార్త మాత్రం రాష్ట్రమంతటా పెద్ద న్యూస్ అయిపోయింది. ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న ఓ పార్టీకి అధ్యక్షుడు మారాడంటే మామూలుగా అసలు చర్చనే జరగదు. కానీ.. ఈసారి లక్ష్మణ్ స్థానంలో బండి సంజయ్ రావడం మాత్రం బర్నింగ్ టాపిక్ అయిపోయింది. బీజేపీకి పేరు ఘనంగా ఉన్నా లోకల్ ఎన్నికల్లో కలిసి రావడం లేదు. మరి ఈసారి బండి లాగేవాడే వచ్చాడన్న సంకేతాలు కనిపిస్తున్నాయా.. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి సీనియర్ల సహకారంతో.. పార్టీని విజయతీరాలకు చేర్చే ఒక్కమగాడు వచ్చాడా.. విశ్లేషిద్దాం.

89వేల 508 ఓట్ల మెజారిటీతో గెలిచాడు మరి.

బండి సంజయ్ ఎదుగుదల మాములుగా లేదు. శిశుమందిర్ లో చదివాడు. ఏబీవీపీలో విద్యార్థి నేతగా ఎదిగాడు. ఆర్ఎస్ఎస్ లో యాక్టివ్ ఉంటూ కరీంనగర్ కార్పొరేటర్ గా పలుమార్లు గెలిచాడు. దెబ్బ తిన్న పులిలా రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బకొట్టి వెలిగాడు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పుడు వచ్చిన సానుభూతి… హిందూ ధర్మం గురించి ఆయన కార్యక్రమాలు.. మోడీ వేవ్ కలిసి.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సంచలన విజయం సాధించారు. గెలిచిన నలుగురు ఎంపీల్లో అందరికంటే ఎక్కువ మెజారిటీ బండి సంజయ్ దే. టీఆర్ఎస్ పార్టీ బలమైన నాయకుడు, కేసీఆర్ రైట్ హ్యాండ్ లాంటి బి.వినోద్ ను 89వేల 508 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించి సంచలన విజయం సాధించాడు బండి సంజయ్.

బండి సంజయ్.. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్

ఒక్కరోజులో మరోసారి సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయాడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. పార్లమెంట్ ఎన్నికలకు ముందు.. బండి సంజయ్ ఫీవర్ తో .. సెల్ ఫోన్లు మోగిపోయాయి. యూట్యూబ్ లో ఆయన పాటలకు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. జనంలో బండి సంజయ్ పట్ల వచ్చిన పాజిటవ్ వేవ్ కారణంగా.. గెలుపు ఎన్నికలకు ముందే దాదాపుగా ఖాయమైపోయింది. మళ్లీ.. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎన్నికయ్యాక.. చాలామంది వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ స్టేటస్ లలో బండి సంజయ్ కనిపించారు.

జైజై మాతా.. భారత్ మాతా… జనగణమన జై వందేమాతరం

జైజై బండి.. కమలం బండి.. కాషాయం జెండా మనదండీ.. పాట మరోసారి మోగింది.

కన్నీళ్లు ఊరికే రావు…ప్రేమతో అభిమానంతో వస్తాయి

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ ఓడిపోయినప్పుడు కార్యకర్తలే కన్నీళ్లు పెట్టుకున్నారంటే.. ఆయన పట్ల ఉన్న సెంటిమెంట్ ను అర్థం చేసుకోవచ్చు. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. బండి సంజయ్ కు ఎన్నికల పరంగా పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చాయి. ఇష్యూ పట్ల సిన్సియారిటీ ఉన్నప్పుడే అలాంటి సీన్లు కనిపిస్తాయి. చంద్రయాన్ 2 ఫెయిలైనా.. శివన్ కన్నీళ్లు దేశం ఎన్నటికీ మరిచిపోదు. సిన్సియర్ ప్రయత్నాలు చేసినప్పుడే అలాంటి సంఘటనలు… ఫలితాలకు సంబంధం లేకుండా జనం గుండెలను తాకుతాయి. బండి సంజయ్ కూడా.. అలాంటి ఓ సెంటిమెంట్ సునామీ. హిందూ ధర్మానికి ఆయన ఓ సర్టిఫైడ్ బినామీ.

ఆర్టీసీ ఉద్యమాన్ని కరీంనగర్ కు లాగాడు

ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఇష్యూబేస్డ్ గా హైలైట్ చేసి.. జనామోదం  పొందినప్పుడే ప్రతిపక్షం అనేది నిలబడుతుంది. ఆ పనిని ఆర్టీసీ ఉద్యమ సమయంలో బండి సంజయ్ చేసి చూపించాడు. హైదరాబాద్ కేంద్రంగా ఆర్టీసీ ఉద్యోగోలు, కార్మికుల రెండు నెలల పాటు ఉద్యమించారు. కానీ.. ప్రభుత్వంపై కరీంనగర్ నుంచి ఒత్తిడిని పెంచడంలో బండి సంజయ్ సక్సెసయ్యాడు. కరీంనగర్ కు చెందిన ఓ ఉద్యోగి ప్రాణం కోల్పోయిన సందర్భంలో.. ఆ ఉద్యోగి ఇంటి దగ్గరే ధర్నాకు దిగారు బండి సంజయ్. కార్మికులకు న్యాయం జరిగితే కానీ.. అంత్యక్రియలు జరగనీయమంటూ రోజంతా పట్టుపట్టి నిలబడ్డారు. సాయంత్రం పోలీసులు కాలర్ పట్టుకోవడంతో.. ఈ ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో మరింత సంచలనం రేపింది. బండి సంజయ్ ఎంపీ అయ్యాక.. కరీంనగర్ ఆర్టీసీ ఉద్యోగి కుటుంబానికి మద్దతుగా చేసిన పోరాటం ఓ పెద్ద హైలైట్.

కొండగట్టు ప్రమాద బాధితుల సాయంకోసం పాదయాత్ర

కొండగట్టు ప్రమాద మృతుల కుటుంబీకులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర చేశారు బండి సంజయ్. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. తనవంతుగా ఆర్థిక సహాయం అందించారు.

బైన్సాలో గ్రౌండ్ రిపోర్ట్ చేసిన జర్నలిస్టుకు న్యాయ సహాయం

బైన్సా జరిగిన అల్లర్లు ఇటీవల రాష్ట్రంలో సంచలనం రేపాయి. అక్కడ జరిగింది చిన్న గొడవ అంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్ కు ప్రతిస్పందనగా.. జర్నలిస్ట్ సిద్దు గ్రౌండ్ లెవెల్లో పర్యటించి జరిగిన అల్లర్లపై ఓ డాక్యుమెంటరీ రపొందించాడు. ఇది విజిల్ బ్లోయర్ లాంటి కథనం అని కొందరు విశ్లేషించారు. ఐతే.. రిపోర్ట్ రెచ్చగొట్టేదిలా ఉందంటూ పోలీసులు జర్నలిస్ట్ సిద్ధుపై కేసులు పెట్టారు. ఐతే.. ఆ జర్నలిస్టుకు అండగా నిలబడి.. ఢిల్లీకి రప్పించి హైకోర్టు లాయర్ తో న్యాయ సహాయం అందించాడు బండి సంజయ్. హైకోర్టు ఈ కేసులో అరెస్టులు చేయొద్దంటూ పోలీసులకు సూచన చేయడంతో.. జర్నలిస్టు సిద్దుకు జైలు శిక్ష తప్పింది. అలా.. హిందూ సమాజం.. రైట్ వింగ్ లో.. బండి సంజయ్ పేరు మరోసారి మార్మోగింది.

బీజేపీలో‌ ఆర్థికంగా బలమైన నేతలు ఎంతో మంది.. అధ్యక్ష స్థానం కోసం ప్రయత్నించినా… దశాబ్దాల కాలంగా బలమైన లాబీగా ఉన్న హైదరాబాద్ నేతలు తీవ్రంగా ప్రయత్నించినా… అధ్యక్ష పదవి మాత్రం ఓ సామాన్య కార్యకర్తకే దక్కింది. ఇలాంటిది ఒక్క బీజేపీలోనే సాధ్యమని మరోసారి నిరూపితమైంది.

బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడయ్యాడన్న వార్త .. పార్టీ శ్రేణుల్లో, అభిమానుల్లో భారీగా పాజిటివ్ సంకేతాలను నింపింది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇది ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందనేది తెలియాల్సి ఉంది.

bandi sanjay
bandi sanjay

 

 

(Visited 1,194 times, 1 visits today)