కేక రివ్యూ : కొత్త లొట్టిలో పోసిన పాచికల్లు.. అల వైకుంఠపురములో..!

Ala Vaikunthapuramulo Review and Rating
Spread the love

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ – తమన్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా విడుదలైంది అల వైకుంఠపురములో.. మూవీ. తమన్ పాటలు సూపర్ హిట్ అవ్వడం…. అల్లుఅర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా కావడంతో.. మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అల వైకుంఠపురములో అందుకుందా లేదా ఓసారి చూద్దాం.

కొత్త లొట్టిలో పోసిన పాచి కల్లు.. అల వైకుంఠపురములో సినిమా అనిపిస్తుంది. ఆస్తిని కాపాడటం… కంపెనీని బాగుచేయడం. తనకు బాగా అచ్చివచ్చిన ఈ లైన్ ను… కొత్త క్యారెక్టర్లు, కొత్త ముఖాలతో… నేపథ్యాలు మార్చి పదే పదే రిపీట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. నేపథ్యాలు మార్చినా… ప్రొటాగనిస్ట్ లక్ష్యం మాత్రం ఎప్పుడూ అదే ఉంటుంది.

మేనత్త ఆస్తిని కాపాడటం.. ఆమె కంపెనీని, కుటుంబాన్ని ఒక్కటి చేసేందుకు మేనల్లుడు అత్తారింటికి దారేది అంటూ వచ్చాడు. అది అత్తారింటికి దారేది అయ్యింది.

నాన్న పెట్టిన కంపెనీని, ప్రాపర్టీని కాపాడి అమ్మకు ఇబ్బందులను తొలగించేందుకు రహస్యంగా పెరిగిన కొడుకు ప్లాన్ బీ రూపంలో వచ్చి అన్నీ చక్కబెట్టాడు. అది అజ్ఞాతవాసి అయింది.

ఇపుడు కూడా ఓ అమ్మ ఆర్థికంగానూ… కుటుంబపరంగానూ ఇబ్బందుల్లో ఉంది. ఆమెను కష్టాలనుంచి బయటపడేసేందుకు అసలైన కొడుకుగా వచ్చాడు. ఆ కుటుంబానికి ఏమీ కానివాడు.. అసలైన కొడుకు ఎలా అయ్యాడన్నదే ఈసారి కథ. అన్నీ ఎప్పుడో చూసిన ఎమోషన్సే. కానీ.. ఈసారి పాత్రలు మారిపోయాయంతే.

ఎలా సాగింది…

ఇటీవల తన సినిమాల్లో మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ను.. కార్పొరేట్ లైఫ్ స్టైల్ ను రెండింటినీ ఒకేసారి చూపిస్తూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు త్రివిక్రమ్. ఈసారి ఓ ధనంతులైన బిడ్డను.. మిడిల్ క్లాస్ బిడ్డను పురిటిలోనే మార్చి.. జీవితాల్లోని మార్పు కోరుకునే మిడిల్ క్లాస్ మనస్తత్వాన్ని, తన కొడుకు బాగా పెరగాలనుకునే ఓ తండ్రి స్వార్థాన్ని చూపించాడు. ఈ ప్రయత్నంలో ఫస్టాఫ్ బాగా సాగినా.. సెకండాఫ్ దెబ్బకొట్టింది. క్లైమాక్స్ అయితే మరీ వీక్.

బ్రిడ్జీపై తండ్రికాని తండ్రితో అసలు విషయం తేల్చుకునే సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్  పడి ఉంటే.. ఇంకా బాగుండేదేమో.

ఆసక్తిగా సాగాల్సిన కథనం కూడా.. స్లోగా నడిచి.. ప్రేక్షకున్ని ఇబ్బందిపెట్టింది. అత్తారింటికి దారేది, జులాయి సినిమాల్లో కనిపించే వేగం… ఈ మధ్య త్రివిక్రమ్ సినిమాల్లో కరువైంది. నిజం చెప్పేటప్పుడే టెన్షన్ ఉంటుంది.. అబద్ధం చెబితే.. ఆ తర్వాతంతా టెన్షనే అనే డైలాగ్ మూవీకి బాగా కనెక్టింగ్ గా ఉంటుంది. త్రివిక్రమ్ కలం వాడికి.. కథనంలో వేగం తోడైతే… సినిమాలు క్లాసిక్స్ గా మిగిలిపోవడం ఖాయం.

ఎవరు ఎలా చేశారు

అల్లు అర్జున్ మెయిన్ అసెట్.

అల్లు అర్జున్ చాలారోజుల తర్వాత.. వెండితెరపై విజువల్ ఫీస్ట్ ఇచ్చాడు. ఆయన స్టైలింగ్… పాటల్లో స్టెప్పులు కేక. పెర్ఫామెన్స్ లోనూ అల్లు అర్జున్ తన క్లాస్ ను చాటుకున్నాడు.

హీరోయిన్ పూజా హెగ్డేకు నటించడానికి పెద్ద ప్రాధాన్యం దక్కలేదు. ఆమెను పాటల్లో బుట్టబొమ్మలాగే చూపించాడు దర్శకుడు. ఐతే.. పూజా హెగ్డే తొడలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాడు. ఆ తొడలను చూసి హీరో ఫ్లాటైపోతాడు. అదేం విడ్డూరమో. వినడానికి బాగుండదనే ఉద్దేశంతో.. నీ తొడలు అని కాకుండా…. నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు అని మార్చి రాయించారేమో. ఏదేమైనా… వీడియో కంటే.. ఈ పాట ఆడియోనే బాగా నచ్చుతుంది. 

మురళీ శర్మ పాత్రే హైలైట్

టబు కంటే.. ఆమె భర్త జయరాం, తండ్రి సచిన్ కేడ్కర్ లవే కీలకమైన పాత్రలు. ఓ కొడుకు.. కన్న తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే సినిమా కావడంతో.. తండ్రులుగా నటించిన మురళీ శర్మ, జయరాం… కొడుకు పాత్రధారి అల్లు అర్జున్ లపైనే ఎక్కువ సీన్స్ ఉంటాయి. అక్కసు, స్వార్థం నిండిన తండ్రి పాత్రలో మురళీ శర్మ అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అల్లు అర్జున్ తర్వాత.. మురళీ శర్మ పెర్ఫామెన్సే మూవీకి హైలైట్.

సుశాంత్ పాత్ర సినిమా మొత్తం కీలకమైనదే అయినా.. అతడి పాత్ర నామమాత్రంగానే సాగింది. నివేతా పేతురాజ్ క్లైమాక్స్ లో విలన్ ఎత్తుకుపోవడానికి పనికొచ్చింది తప్ప ఆడియన్స్ పై ఇంపాక్ట్ ఉండదు.

పాటలే ఈ మూవీకి అతిపెద్ద ప్లస్ పాయింట్

తమన్ అందించిన సంగీతం.. బ్యాక్ గ్రౌండ్ స్కోరు.. సినిమాకు ఓ రేంజ్ తీసుకొచ్చాయి. పాటొచ్చిన ప్రతిసారి ప్రేక్షకుడు రీచార్జ్ అవుతుంటాడు. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంటుంది.  కెమెరా వర్క్ మాత్రం అద్భుతం అనే చెప్పాలి.

అలరించే ప్రి -క్లైమాక్స్ పాట ఫైట్

ఊరీకి ఉత్తరాన అంటూ… అరవింద సమేతలో… వచ్చే ఉద్వేగభరిత పాట బాగా హిట్టయింది. అదే స్టైల్లో మరో ఫోక్ సాంగ్ తో ఫైట్ డిజైన్ చేశాడు డైరెక్టర్. స్లో మోషన్ లో సాగే ఆ పాట ఫైట్ కూడా కొత్తగా అనిపిస్తుంది.

రాములో రాములా .. పాటలో బ్రహ్మానందం ఇలా మెరిసి అలా మాయమయ్యాడు.

మైనస్ పాయింట్స్

గురూజీ త్రివిక్రమ్ డైలాగులకు వంక పెట్టలేం. కానీ ఆయన కామెడీ టైమింగ్ మాత్రం మిస్సవుతోంది. అత్తారింటికి దారేది సినిమాకోసం ఎక్కువగా అల్లుకున్న సీన్లు, రాసుకున్న డైలాగుల చుట్టూ మరో కథనం అల్లేసి.. ఇలా వరుసపెట్టి సినిమాలు తీస్తున్నాడా అనే డౌట్ రాకమానదు.

సెకండాఫ్ పైనే ఎక్కువ కంప్లయింట్స్ ఉంటాయి. నీరసంగా సాగుతున్న సెకండాఫ్ లో ఊపుకోసం బోర్డ్ మీటింగ్ ఎపిసోడ్ ను “గబ్బర్ సింగ్” తరహాలో పాటలతో డిజైన్ చేశాడు.

క్లైమాక్స్ వీక్. టబు నిర్ణయం హడావుడిగా అనిపిస్తుంది. ఎమోషనల్ వెయిట్ ఎక్కువవుతుందని అలా చేసిఉండొచ్చు.

ఓవరాల్ గా ఈ మూవీ.. త్రివిక్రమ్ మరింత కొత్తగా ఆలోలించాల్సిన అవసరాన్ని అయితే గుర్తుచేస్తుంది.

పంచ్ లైన్ : నాన్నారింటికి దారేది..

 

(Visited 147 times, 1 visits today)
Author: kekanews